Pandu Master Road Accident
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ డాన్స్ షో ఫేమ్ పండు మాస్టర్ (Pandu Master) ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
*స్థానిక వివరాల ప్రకారం..
విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో జరిగిన ఒక గ్రామ జాతర (తిరునాళ్ల) వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డాన్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు పండు మాస్టర్ విచ్చేశారు. అర్ధరాత్రి వరకు సాగిన ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ముగించుకుని, ఆయన తన బృందంతో కలిసి కారులో తిరుగుపయనమయ్యారు.
ఈ క్రమంలో ఆనందపురం జాతీయ రహదారి సమీపంలోకి రాగానే, వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉంది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక బొలెరో వాహనం, పండు మాస్టర్ ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. అర్ధరాత్రి 1:00 గంట తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
*రెండు కాళ్లకు తీవ్ర గాయాలు…
బొలెరో వాహనం అత్యంత వేగంగా ఢీకొట్టడంతో కారు వెనుక భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. ప్రమాద వార్త తెలుసుకున్న అభిమానులు, తోటి డాన్సర్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
