* చందనోత్సవానికి వచ్చిన భక్తుల్లో ఏడుగురు దుర్మరణం
* మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
* భారీ వర్షం.. గోడ కూలడంతో దుర్ఘటన
ఆకేరు న్యూస్, విశాఖపట్నం: ఆంధ్రపద్రేశ్లోని సింహాచలం(Simhachalam) అప్పన్న సనిధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. చందనోత్సవం (Chandanotsavam) వేళ 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి, వానకు గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం తీవ్రంగా కలచివేస్తోంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రిస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి రూపంలో దర్శనమివ్వనున్న అప్పన్నస్వామిని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
చనిపోయిన వారు వీరే..
* పత్తి దుర్గాస్వామినాయుడు (32), మాచవరం, తూర్పుగోదావరి జిల్లా
* కుమ్మపట్ల మణికంట (28), మాచవరం, తూర్పుగోదావరి జిల్లా
* ఎడ్ల వెంకటరావు (48) అడవివరం, విశాఖపట్టణం
* గుజ్జరి మహాలక్ష్మి (68), హెచ్బీ కాలనీ, విశాఖపట్టణం
* పైలా వెంకటరత్నం (45), ఉమానగర్,వెంకోజీపాలెం , విశాఖపట్టణం
* పిల్లా ఉమామహేశ్ (30), చంద్రపాలెం, మధురవాడ, విశాఖపట్టణం
* పిల్లా శైలజ (26), చంద్రపాలెం, మధురవాడ, విశాఖపట్టణం
దిగ్భ్రాంతికరం
వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. భారీ వర్షాల (Rain) కారణంగా ప్రమాదం జరిగిందని, పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు వెల్లడించారు. భక్తుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చందనోత్సవ వేళ ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తీవ్ర ఆవేదనకు గురిచేసింది: మంత్రి లోకేష్
సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
