– కాంట్రాక్టర్ దిగి రాకపోతే బొగ్గు లారీలను నడవనీయం
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని రైల్వే బొగ్గు డంపింగ్ యార్డ్ అన్లోడింగ్ కార్మికులు నేతాజీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిరసన చేపట్టారు. బొగ్గు లోడుతో వెళ్తున్న లారీలను డంపింగ్ యార్డ్‌కు వెళ్లకుండా రహదారిపై నిలిపివేశారు. మా పని మాకు కల్పించాలి, పనికి తగ్గ వేతనం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం నేతాజీ యూనియన్ ఉపాధ్యక్షుడు పుల్ల విజయ్ చందర్ మీడియాతో మాట్లాడుతూ కొత్త కాంట్రాక్టర్ 10 మందికి మించి పనిలోకి తీసుకోవట్లేదని, గత 25 ఏండ్లుగా ఉప్పల్ డంపింగ్ యార్డ్ లో పనిచేస్తున్నటువంటి 287 మంది లో కేవలం 10 మంది మాత్రమే పని కల్పిస్తే మిగిలిన వారందరూ ఉపాధి కోల్పోతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యాగన్ కి గతంలో చెల్లించిన వేతనం కంటే 60 శాతం తగ్గించి వేతనం ఇస్తానని అన్నాడన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ దిగి రాకపోతే బొగ్గు లారీలను నడవనీయం అని అన్నారు.కార్యక్రమంలో నేతాజీ యూనియన్ అధ్యక్షులు జక్కుల రాజు, జెట్టి శ్రీనివాస్, మిలుకూరి రాజు, ఎర్రబెల్లి రామారావు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
……………………………………..
