ఫామ్-6 ద్వారా తిరిగి నమోదు కోసం దరఖాస్తు
* ఫామ్-6తో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు..
ఆకేరు న్యూస్, డెస్క్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు కనిపించని వారికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది.
గతంలో ఓటరుగా నమోదై ఉండి, ప్రస్తుతం ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఫామ్-6 (Form 6 Voter Registration) ద్వారా తిరిగి నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పలు అంశాలను వివరించింది.
* ఫామ్-6 దరఖాస్తుపై ప్రాసిక్యూషన్ ఉండదు..
గతంలో ఓటరు జాబితాలో పేరు ఉండి, SIR ప్రక్రియ అనంతరం విడుదలైన ముసాయిదా జాబితాలో పేరు కనిపించని వారు ఫామ్-6 (Form 6 Voter Registration) సమర్పించడానికి కొందరు వెనుకాడుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఫామ్-6లో మొదటిసారిగా ఓటరుగా నమోదు చేసుకుంటున్నట్లు ప్రకటించాల్సి ఉండటంతో, గతంలో ఓటరుగా ఉన్నవారు తప్పుడు ప్రకటన చేసినట్లవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారని తెలిపింది.
ఈ సందేహాలకు తెరదించుతూ.. గతంలో ఓటరుగా నమోదై ఉన్నారనే ఒక్క కారణంతో ఫామ్-6 దరఖాస్తుదారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 కింద ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోబోమని ఈసీ స్పష్టం చేసింది. అయితే, సంబంధిత వ్యక్తి మరే ఇతర పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు అయి ఉండకూడదని, దరఖాస్తులోని ప్రకటన చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని షరతు విధించింది.
* ఓటర్లను గుర్తించి తిరిగి నమోదుకు చర్యలు..
ఓటరు జాబితా సవరణలో భాగంగా గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనవారు (ASDD)గా గుర్తించిన ఓటర్లను సంప్రదించి, అర్హులైన వారిని తిరిగి జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.
నవంబర్ 6న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, నివాసం మారని కొందరు ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌తో పాటు గతంలో ఫారమ్ సమర్పించకపోవడానికి గల కారణాలను వివరిస్తూ సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన ఓటర్లు తుది జాబితాలో చోటు కోల్పోకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
ఈ స్పష్టతను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రధాన ఎన్నికల అధికారులు స్థానిక భాషల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ఎన్నికల సంఘం సూచించింది. తద్వారా ఓటర్లలో ఉన్న సందేహాలు, ఆందోళనలను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

