ఆకేరు న్యూస్, హైదరాబాద్: పోలింగ్ రోజున, ఆ తర్వాత ఏపీలో జరిగిన అల్లర్ల ఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కౌంటింగ్ రోజున, ఫలితాల అనంతరం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారీగా పోలీసులను మోహరింపచేసింది. రాష్ట్రమంతటా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 168 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్నవారిపై చార్జ్షీట్లు బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.
బాణసంచా విక్రయాలు, ర్యాలీలు నిషేధం
ఏపీలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. బాణసంచా విక్రయాలపై ఈసీ నిషేధం విధించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో.. ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేసింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా అమ్మినా, కాల్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
————————–