* మహిళా కార్మికురాళ్లను బెదిరించి లైంగిక వేధింపులు
* వీడియోలను తీసి పైశాచికానందం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పొట్టకూటి కోసం పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసేందుకు వచ్చిన కొందరు మహిళలను బెదిరించేవాడు. తన‘దారి’కి వస్తే పనులు చేయకున్నా చేసినట్లుగా చూపించడం…ఎదురు తిరిగినా….‘దారి’కి రాకున్నా పనుల నుంచి తొలగించడం చేస్తోండటంతో సదరు ఎస్ఎఫ్ఎ బెదిరింపులకు కొందరు మహిళా కార్మికురాళ్లు తలొగ్గినట్లు తెలిసింది. దారికి వచ్చిన మహిళలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఓ మహిళా ఐఏఎస్ అధికారి ప్రాతినిత్యం వహిస్తున్న సర్కిల్లోనే ఈ తంతు జరుగుతుండటం గమనార్హం .
జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్ల గాజుల రామారం సర్కిల్ 25లో ఓ ఎస్ఎఫ్ఎ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అవి అవినీతి ఆరోపణలు కాదు.. కామకలాపాలు. తన కింద పనిచేసే మహిళా కార్మికురాళ్లపై కన్నెసిన సదరు ఎస్ఎఫ్ఎ తను పిలిచిన చోటుకు రావాలని…లేదంటే వారి పనుల నుంచి తొలగించడం…గైర్హాజర్ పేరితో ఇబ్బందులు పెట్టడం చేస్తున్నట్లు తెలిసింది. కొందరిని భయపెట్టి….బెదిరించి తనదారిలోకి తెచ్చుకుని రాసలీలలు జరుపుతుండటం…ఈక్రమంలోనే వీడియోలు తీసి వారిని మళ్లీ బెదిరిస్తుండటంతో మహిళలు పనులకు రావాలంటేనే బిక్కుబిక్కుమంటున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులకు చెబితే తన పలుకుబడితో తమ ఉద్యోగాలను తొలగిస్తారన్న భయంతో అతని ఆగడాలను భరిస్తున్నట్లు తెలిసింది. అతని ఆగడాలు మరింత తీవ్రం అవుతుండటంతో వ్యూహాత్మకంగా అతని సెల్‌ఫోన్‌ను తీసుకుని వీడియోలను ఇతరుల ఫోన్లకు, ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిసింది. ఇంత జరిగినా ఉన్నతాధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని బాధిత మహిళా కార్మికురాళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
————————-