
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: దేశ భవిష్యత్తు దశ దిశను మార్చేది విద్యనే అని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. మంగళవారం బండారుపల్లి, టి.జి.మోడల్ స్కూల్ పి.యం.శ్రీ. తెలంగాణ మోడల్ స్కూల్ జిల్లాలో ఉత్తమ పి.యం.శ్రీ. స్కూల్ గా ఎంపిక కావడంతో జిల్లా కలెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో కలసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య పట్ల సానుకూల శక్తితో ముందుకు వెళ్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఎదగడానికి అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నా మంచి కలలను కనాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. విద్యార్థి, విద్యార్థినిలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాలని , ప్రతి విద్యార్థి శ్రద్ధ, నిబద్ధత, క్రమశిక్షణతో ఎన్ని సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు యువత పైనే ఉందని, దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ తెలిపారు. పి.యం.శ్రీ. పథకంలో భాగంగా టి.జి., మోడల్ స్కూల్ కి విడులైన నిధులను పాఠశాల అవసరాలకు అత్యుత్తమంగా ఖర్చు చేసి జిల్లాలో ఉత్తమ పాఠశాలగా నిలిచినందుకు పాఠశాల ప్రిన్సిపల్ కి, అధ్యాపక బృందానికి, విద్యార్దులకు అభినందనలు తెలిపారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి గా రాష్ర్ట ముఖ్య మంత్రి ఉండడం వల్ల విద్యాశాఖకి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని, ఇది మనలాంటి వెనుకబడిన ప్రాంతాలలో విద్యా అబివృద్ధికి, విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పథకంలో భాగంగా పాఠశాలకు మంజూరు అయిన సంగీత పరికరాలను కలెక్టర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో కలసి విద్యార్థులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సింగారం దేవకి, మండల విద్యాధికారి తిరుపతి, జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్ అర్షం రాజు, పాఠశాల అధ్యాపకులు సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………