Arun shourie journalist Gundu Rao Off The Record Controversy karnataka
* ఆ పౌడర్ పూసుకునే వాళ్లా .. వాళ్ళనెవరు పట్టించుకోరు
* పెను సంచలనం ఆ కథనం
* ఈ రాజకీయ పరిణామం ఏ రాష్ట్రంలో జరిగిందంటే..?
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి :
అధికార వైభవం మద్య అందరూ తన కంటే తక్కువగానే కనిపిస్తారటా..! కానిస్టేబుల్‌ను చూసి కంగారు పడే స్థాయి నుంచి పోలీస్ అత్యున్నత స్థాయి అధికారి డీజీపీ సైతం సలాం కొడుతుంటే .. మరో వైపు సీనియర్ ఐ ఏయస్, ఐపీయస్ లు ఒక్కరొక్కరుగా తన అపాయింట్ మెంట్ల కోసం వేచి చూస్తుంటే .. సమాజమంతా సహజంగానే సదరు నేతలకు లిల్లీ పుట్ లయిపోతారు.. తన కనుసైగతోనే సమాజం కదులుతోందనుకుంటారు.. మనం లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందనుకుంటారు.. అధికార ఆర్బాటాల మద్య అహంభావం తలకెక్కి నోరుకు అడ్డూ , అదుపు లేకుండా పోతుందంటారు పెద్దలు.. అచ్చంగా ఇలాంటి పరిస్థితుల వల్లనే ఓ పెద్ద మనిషి ఏకంగా ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నాడు.. ఎవరా ముఖ్యమంత్రి ఏమా కథా.. తెలుసుకుందాం..
* ఆఫ్ ది రికార్డ్ అంటే రాయకూడదా..!?
జర్నలిజం వృత్తిలో తరచుగా వినే పదం .. ఆఫ్ ది రికార్డ్ .. రాజకీయ నాయకులు , అధికారులు తాము చెప్పదలుచుకున్నదంతా చెప్పేసీ తమ సౌకర్యం కోసం అదంతా ఆప్ ది రికార్డ్ లో చెప్పాను.. మరీ మీడియాలో రాయకూడదు అంటారు.. నిజానికి సదరు జర్నలిస్ట్ ఎంపిక చేసుకున్న స్టోరీ కి అవసరమైన అతి ముఖ్యమైన అంశాలను చెబుతూనే ఆప్ ది రికార్డ్ అంటారు.. అయితే ఆఫ్ ది రికార్డ్ అనే పదానికి ఎలాంటి ప్రత్యేక చట్టపరమైన రక్షణ లేదు. ఒకవేళ జర్నలిస్టు ఆ నిబంధనను ఉల్లంఘించి వార్త రాసినా, అతనిపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. ఇది పూర్తిగా నైతికపరమైనది.ఇది జర్నలిస్టుకు, సమాచారం ఇచ్చే వ్యక్తికి (Source) మధ్య ఉండే ఒక నమ్మకమైన ఒప్పందం మాత్రమే..
ఇక అసలు విషయానికి వద్దాం..
* ఆఫ్ ది రికార్డ్ సీఎం పదవి గోవిందా ..!
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ , ధైర్య సాహసాలు కలిగిన ల నాయకుడిగా రామ గుండూరావు (R. Gundu Rao) కు పేరున్నది.ఆయన 1980 నుండి 1983 వరకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన రాజకీయ ప్రస్థానం కింది స్థాయి నుంచి మొదలైంది . కుశాల నగర్ టౌన్ మున్సిపల్ చైర్మన్ గా దాదాపు పదేళ్ళు పనిచేశారు. 1980 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేవరాజ్ అర్స్ ప్రభుత్వం పడిపోవడంతో, ఇందిరా గాంధీకి అత్యంత నమ్మకస్థుడైన గుండూరావు 1980 జనవరి 12న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 42 ఏళ్ల వయసులోనే సీఎం పదవి చేపట్టిన అతి పిన్న వయస్సులో గుండూరావు ఒకరు.
అప్పట్లో అరుణ్ శౌరీ బెంగళూరు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గుండూరావు ఆయనను ఒక ప్రైవేట్ సమావేశానికి ఆహ్వానించారు. అది అధికారిక ఇంటర్వ్యూ కాదని, “ఆఫ్ ది రికార్డ్” (Off the record – పత్రికల్లో రాయకూడదనే నిబంధనతో కేవలం స్నేహపూర్వక సంభాషణ అని గుండూరావు భావించారు.
ఆ నమ్మకంతో గుండూరావు తన సహజ శైలిలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గురించి, కాంగ్రెస్ హైకమాండ్ గురించి, సొంత పార్టీ నాయకుల గురించి అత్యంత వివాదాస్పదమైన, అవమానకరమైన వ్యాఖ్యలు (Derogatory remarks) చేశారు. ఢిల్లీ పెద్దలను తానెలా మేనేజ్ చేస్తున్నానో కూడా కాస్త అతిశయంతో చెప్పుకొచ్చారు.
* ఎప్పటికీ ..ఆన్ ది రికార్డే…
అరుణ్ శౌరీ ఆ మాటలను వదిలిపెట్టలేదు. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి మానసిక స్థితిని, ఆయనకు వ్యవస్థల పట్ల ఉన్న చులకన భావాన్ని ప్రజలకు చూపించడమే జర్నలిజం బాధ్యత అని శౌరీ నమ్మారు. తనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదా..? నేను జర్నలిస్ట్ ను కానా..? అంటూ మరుసటి రోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో గుండూరావు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను అక్షరం పొల్లు పోకుండా యథాతథంగా మొదటి పేజీలో బ్యానర్ స్టోరీగా ప్రచురించారు.ఈ కథనం పెను సంచలనం సృష్టించింది. దేశమంతా పెద్ద చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనాలు మొదలయినాయి.
*ఇందిరా గాంధీ ఆగ్రహం – గుండూరావు ఒంటరి
ఈ కథనం దేశ రాజధాని ఢిల్లీని ఊపేసింది. తనను ముఖ్యమంత్రిని చేసిన ఇందిరా గాంధీపైనే గుండూరావు అలాంటి వ్యాఖ్యలు చేశారని తెలియడంతో హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఒక్క కథనంతో గుండూరావుకు ఢిల్లీలో ఉన్న రాజకీయ రక్షణ పూర్తిగా కోల్పోయింది. అప్పటివరకు ఆయనను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పక్కన పెట్టడం ప్రారంభించింది. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపులు బలం పుంజుకున్నాయి.
ఇదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.ఆర్. అంతులేను పదవి నుంచి దించేసిన “సిమెంట్ కుంభకోణం” పై కూడా అరుణ్ శౌరీ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ సిమెంట్ కోటాల కేటాయింపుల నీడలు కర్ణాటకలోని గుండూరావు ప్రభుత్వంపై కూడా పడ్డాయి. పారదర్శకత లేని పాలన సాగిస్తున్నారనే ఆరోపణలకు అరుణ్ శౌరీ కథనాలు మరింత బలాన్ని చేకూర్చాయి.
ఒకవైపు క్షేత్రస్థాయిలో భాషా సెంటిమెంట్‌తో డాక్టర్ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గోకాక్ ఉద్యమం గుండూరావును ప్రజల్లో దెబ్బతీస్తే… మరోవైపు పత్రికా రంగం ద్వారా అరుళ్ శౌరీ చేసిన ఎక్స్పోజ్ ఆయనను రాజకీయంగా, నైతికంగా పతనం చేసింది. దీనితో పాటు భాషా వివాదం కూడా సీఎం పదవి పోవడానికి కారణమైంది.
* ఆ పౌడర్ పూసుకునే వాళ్లా .. !
కర్ణాటకలో కన్నడ భాషా గుర్తింపుకు సంబంధించిన వివాదం చెలరేగింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు సంస్కృతానికి ప్రథమ భాషా హోదా ఇచ్చాయి. దీనిపై వివాదం రావడంతో ప్రభుత్వం వినాయక కృష్ణ గోకాక్ (VK Gokak) నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రాష్ట్రంలో కన్నడకు ఏకైక ప్రథమ భాషా హోదా ఇవ్వాలి అని సిఫార్సు చేసింది.కానీ రాష్ట్రంలోని మైనారిటీల యిన ఉర్దూ, తమిళం, తెలుగు, మరాఠీ మాట్లాడేవారి ఓట్లపై ప్రభావం పడుతుందేమోనన్న భయంతో ముఖ్యమంత్రి గుండూరావు ఈ నివేదికను అమలు చేయడానికి నిరాకరించారు. దీనితో కన్నడ మేధావులు, రచయితలు ఉద్యమానికి దిగారు.
ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్నాసీఎం గుండూరావు లెక్కచేయలేదు. ఆ సమయంలో జర్నలిస్టులు ఆయనను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో… “ఈ ఉద్యమానికి ప్రజల్లో మద్దతు ఉంది, సినిమా నటులు కూడా మద్దతు ఇస్తున్నారు కదా?” అని ప్రశ్నించారు.దానికి గుండూరావు తన నైజం ప్రకారం అత్యంత ధీమాగా, కాస్త అహంకారంతో సమాధానమిస్తూ: సినిమా వాళ్లా ? వాళ్లు కేవలం పౌడర్ రాసుకుని, రంగులేసుకుని స్క్రీన్ మీద నటిస్తారు. వాళ్లకేం తెలుసు రాజకీయం? వాళ్లను జనం థియేటర్లలోనే చూస్తారు తప్ప రోడ్ల మీదకు వస్తే ఎవరూ పట్టించుకోరు అని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్య అప్పట్లో కన్నడ చిత్ర పరిశ్రమను, ముఖ్యంగా డాక్టర్ రాజ్‌కుమార్‌ను తీవ్రంగా గాయపరిచింది. అప్పటివరకు కేవలం నటనకే పరిమితమై, రాజకీయాలకు దూరంగా ఉన్న రాజ్‌కుమార్… ఈ సవాల్‌ను స్వీకరించి నేరుగా రంగంలోకి దిగారు.
* స్థంభించిన కర్ణాటక
సినీ నటుడు రాజ్‌కుమార్ గోకాక్ ఉద్యమానికి మద్దతుగా రోడ్ల మీదకు రావడంతో కర్ణాటక ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆయన పిలుపుతో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఉత్తర కర్ణాటక నుండి దక్షిణ కర్ణాటక వరకు రాజ్‌కుమార్ చేసిన పర్యటనలకు జనసందోహం పోటెత్తింది.
ప్రజల్లో ఒక హీరోకి ఉండే ఇమేజ్ ముందు గుండూరావు ప్రభుత్వ అణచివేత చర్యలు పూర్తిగా విఫలమయ్యాయి. రైళ్లపై, బస్సులపై రాజ్‌కుమార్ కి జై అంటూ నినాదాలు మార్మోగాయి.
పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన గుండూరావు, చివరికి దిగివచ్చి గోకాక్ నివేదికను యథాతథంగా ఆమోదించక తప్పలేదు. కానీ, అప్పటికే జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయింది. ఒక కన్నడ అస్తిత్వ నాయకుడిగా రాజ్‌కుమార్ ఇమేజ్ ఆకాశానికెగిసింది. గుండూరావు ఇమేజ్ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది. సీఎం పీఠం చేజారింది..
—————————————————–
