* బ్రిటన్ నుంచి అమెరికాలోని నార్తర్న్ మారియానా దీవులకు పయనం
* నేరం అంగీకరించేందుకు సిద్ధమైన అసాంజే
* అదనపు జైలు శిక్ష నుంచి విముక్తి లభించేనా
ఆకేరు న్యూస్ డెస్క్ : అమెరికా రక్షణ సమాచారాన్ని రహస్యంగా పొంది.. లీక్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ (WikiLeaks) వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే (Julian Assange)కు బ్రిటన్ జైలు జీవితం నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్, అసాంజే మధ్య జరిగిన ఒప్పందం మేరకు.. ఆయన ప్రత్యేక విమానంలో బ్రిటన్ నుంచి బయలుదేరి వెళ్లారు. అమెరికాలోని నార్తర్న్ మారియానా దీవుల్లో ఉన్న కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. రక్షణ సమాచార వ్యాప్తిపై అసాంజే నేరం అంగీకరిస్తే.. ఏళ్ల తరబడి అమెరికా చేస్తున్న పోరాటానికి ముగింపు పడే అవకాశం ఉంది.
ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థగా 2006లో ఏర్పడిన వికీలీక్స్.. గుప్తసమాచారాన్ని క్రోడీకరించి ప్రచురించేది. ఉత్తర అమెరికా, తైవాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చైనా దేశాలకు చెందిన పాత్రికేయులు, మేధావులు, విజ్ఞాన వేత్తలు, చైనా విప్లవకారులు తదితరులు కలిసి ఈ సంస్థను స్థాపించారు. ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు జూలియన్ అసాంజే ఈ సంస్థ వ్యవస్థాపకులు. 2010 ఏప్రిల్లో వికీలీక్స్ బాగ్దాద్ కు చెందిన ఓ వీడియోను వెబ్సైట్లో పోస్టు చేసింది. ఇరాక్ దేశస్తులను అమెరికా సైనికులు హతమార్చిన దృశ్యాలు ఆ వీడియోలో ఉండడం అప్పట్లో సంచలంగా మారింది. అలాగే 2010 జూలైలో ఆఫ్గన్ వార్ డైరీ, అన్న పేరుతో 76,900 పై చిలుకు పత్రాలను వార్ ఇన్ ఆఫ్ఘనీస్థాన్ పేరుతో విడుదల చేసింది. అదే సంవత్సరం అక్టోబర్ లో ఇరాక్ యుద్ధానికి సంబంధించి దాదాపు 400,000 పత్రాలను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో అప్పటికే పలు కేసులు, ఆరోపణలు ఎదుర్కొన్న అసాంజేకు 2019 ఏప్రిల్ లో బ్రిటీష్ కోర్టు 50 వారాల జైలు శిక్ష విధించింది. అమెరికా రక్షణ సమాచారం వ్యాప్తిపై అప్పటికే అగ్రరాజ్యం కూడా అసాంజే పై చర్యలకు సిద్ధమవుతోంది. బ్రిటీష్ కోర్టు శిక్షను అసాంజే పూర్తి చేసుకున్నప్పటికీ.., అమెరికా వెళ్లడానికి సంబంధించిన కేసు విచారణ పెండింగ్లో ఉండడంతో 2019 నుంచి బెల్మార్ష్ ప్రిజన్లోనే అసాంజే ఉన్నాడు. అమెరికాకు తనను అప్పగించాలని అతను కోర్టు నుంచే పోరాటం చేశాడు. ఇప్పటికే ఐదేళ్లు జైలులోనే ఉన్నందున.. అదనపు శిక్ష విధించబోమని అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ తో అసాంజేకు ఒప్పందం కుదిరింది. నేరం అంగీకరించేందుకు అసాంజే సమ్మతించడంతో బ్రిటన్ జైలు నుంచి విముక్తి లభించింది. అసాంజే తన స్వదేశం ఆస్ట్రేలియా వెళ్తారని అమెరికా న్యాయశాఖ తెలిపింది. వాస్తవానికి అమెరికా కోర్టులో సుమారు 62 నెలల శిక్షపడే అవకాశం ఉన్నది. కానీ బ్రిటన్ జైలులో ఎక్కువ కాలం గడిపినందు వల్ల అమెరికా కోర్టు ఆ శిక్షా కాలాన్ని తగ్గించే లేదా రద్దు అవకాశం ఉన్నది. బ్రిటన్లోని స్టాన్స్టెడ్ ఎయిర్పోర్టు నుంచి అసాంజే విమానం ఎక్కిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2019 నుంచి బెల్మార్ష్ ప్రిజన్లో అతను ఉన్నాడు. అతను మొత్తం 1901 రోజుల పాటు జైలులో గడిపాడు. అమెరికాకు తనను అప్పగించాలని అతను కోర్టు నుంచే పోరాటం చేశాడు.
—————————–