
* కరీంనగర్లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, కరీంనగర్ : బీఆర్ ఎస్ రజతోత్సవ వేడుక నేపథ్యంలో కరీంనగర్లో సన్నాహక సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇయ్యాల భూమికి జానెడున్నోడు, మూడు ఫీట్లున్నోడు ఎగిరెగిరి పడుతున్నడని అన్నారు. కేంద్ర, రాష్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజలను ఏళ్లుగా మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో కేటీఆర్ లేచి నిలబడి మైకు అందుకోగానే జనం సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపైనా, రేవంత్‌రెడ్డిపైనా, బీజేపీపైన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిన సందర్భాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు చేసిన వాగ్ధానాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ‘తాను గొంగలి పురుగునైనా ముద్దాడుతా.. కుష్ఠురోగినైనా కౌగిలించుకుంటా.. ఆరెస్సెస్ నుంచి ఆర్ఎస్యూ దాకా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా అన్ని పార్టీలను కలుపుకుపోతా.. మీరు ఓట్లేసి మమ్మల్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధిస్తా.. మధ్యలో తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి..’ అని నాడు కేసీఆర్ (Kcr)చెప్పిన సందర్భాన్ని గుర్తుచేశారు. అంతటి చిత్తశుద్ధితో కేసీఆర్ పార్టీ పెట్టారని అన్నారు. ఇయ్యాల భూమికి జానెడు ఉన్నోడు, మూడు ఫీట్లు ఉన్నోడు ఎగిరెగిరి పడుతున్నడని, తెలంగాణ గురించి ఏం తెల్వనోడు గూడా కేసీఆర్ ఏంజేసిండని మాట్లాడుతున్నరని ఎద్దేవా చేశారు.
……………………………….