
ఉప్పు తెస్తున్న ముప్పు
* డబ్ల్యూహెచ్వో నివేదికలో సంచలన విషయాలు
* ఉప్పు ఒక టీ స్పూను చాలు..
* రోగాలబారిన పడకుండా ఉండేందుకు కొన్ని సూచనలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉప్పు వాడకం ఎక్కువైతే.. ఎంత ముప్పో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజా నివేదికలో ఆందోళనకర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం పెరుగుతోందని, అది అంత మంచిది కాదని వ్యాఖ్యానించింది. ఒక మనిషి సగటున రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పును కనుక ఆహారంగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ప్రతి ఒక్కరూ ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలను కోల్పోకుండా కాపాడవచ్చని డబ్ల్యూహెచ్వో సూచించింది.
నివేదికలో డబ్ల్యూహెచ్వో ఏం చెప్పిందంటే..
– సగటు ఉప్పు వాడకం 5 గ్రాములకు మించకూడదు.
– ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెద్దలను గమనిస్తే వారిలో సగటు ఉప్పు వాడకం 10.78 గ్రాములుగా ఉంది.
– ఎక్కువ ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల ఊబకాయం సమస్య వస్తుంది.
– అంతేకాదు.. అన్నాశయ క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్, మెనియర్స్, మూత్ర పిండాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
– ఎక్కువ ఉప్పు వాడకం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 18.9 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.
– ఉప్పు వాడకాన్ని తగ్గించడానికి ఖర్చు పెట్టే ప్రతి డాలర్ ఖర్చుకు బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
– తాజా ఆహారాలతో పాటు తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలుల తినడం వల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించొచ్చు.
– ఉప్పు వాడకానికి బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడితే మంచిది.
——————