Fake Bonafide Certificates
* 150 మందిపై ఆరోపణలు
* ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.2 లక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తప్పుడు విద్యా ధ్రువపత్రాల ఆధారంగా ఉపాధ్యాయులు, పోలీసు ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 150 మందికి పైగా ఉంటుందని ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో తన పాత్రను అంగీకరిస్తూ ఉద్యోగం కోల్పోయిన విష్ణు అనే వ్యక్తి, తన స్థానంలో తదుపరి అర్హత కలిగిన అభ్యర్థికి అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారికి (డీఈఓ) వినతిపత్రం సమర్పించారు.
* రూ.2 లక్షలు చెల్లించి నకిలీ సర్టిఫికెట్ పొందానని వెల్లడి
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి ప్రాంతానికి చెందిన విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తాను గార్లపాడు గ్రామంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు, గద్వాలలోని సరస్వతి పాఠశాలలో ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నట్లు పేర్కొన్నాడు.
అయితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదివినట్లు చూపిస్తూ బోనఫైడ్ సర్టిఫికెట్ పొందినట్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ ధ్రువపత్రం కోసం అనిల్ కుమార్ అనే వ్యక్తికి రూ.2 లక్షలు చెల్లించినట్లు విష్ణు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా హైదరాబాద్ జిల్లాలో ఉద్యోగం పొందినట్లు తెలిపాడు.
* 150 మందికి పైగా ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు..
ఈ వ్యవహారంలో తాను ఒక్కడినే కాదని, తనతో పాటు సుమారు 150 మందికి పైగా నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు పొందినట్లు విష్ణు ఆరోపించినట్లు సమాచారం. వీరిలో ఉపాధ్యాయులు, పోలీసు ఉద్యోగాలు పొందినవారు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి మధ్యవర్తి రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సంఖ్య, ఉద్యోగాలు పొందిన వారి వివరాలు, సర్టిఫికెట్ల జారీ వెనుక ఉన్న వ్యక్తుల పాత్రపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
* గతంలోనే కేసు నమోదైనట్లు సమాచారం
ఈ నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంపై గతంలో ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనిల్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సమాచారం. 2024 డిసెంబర్లో ఈ అంశంపై వార్తా కథనం కూడా ప్రచురితమైంది. నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్ వ్యవహారం బయటపడిన తర్వాత తన ఉద్యోగాన్ని నిలిపివేశారని విష్ణు తెలిపినట్లు సమాచారం.
తన నియామకం రద్దు చేసి, ఎంపిక జాబితాలో తదుపరి స్థానంలో ఉన్న అర్హత కలిగిన అభ్యర్థికి ఉద్యోగ అవకాశం కల్పించాలని బాధితులు డీఈఓను కోరారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నకిలీ ధ్రువపత్రాలతో ఎవరెవరు ఉద్యోగాలు పొందారు? వాటిని ఎవరు జారీ చేశారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిజమైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

