Murasu Cyclone Relief Fund
* 17 జిల్లాలకు రూ.37 కోట్లు
* కలెక్టర్లకు రూ.37 కోట్ల నిధుల వినియోగానికి అనుమతి
* తుఫాన్ బాధితులకు సహాయక శిబిరాలు..
ఆకేరు న్యూస్, డెస్క్ : మురసు తీవ్ర తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలను వేగవంతం చేసింది. తుఫాన్ ప్రభావం, భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 17 జిల్లాలకు మొత్తం రూ.37 కోట్ల నిధుల వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ నవంబర్ 2న జీఓ ఆర్టీ నంబర్ 120 జారీ చేసింది. విపత్తు సహాయక చర్యల కోసం కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు రూల్ టీఆర్-27 కింద ఈ నిధులను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
* ఏ జిల్లాకు ఎంతంటే..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న ఆరు జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున కేటాయించారు. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఈ నిధులు అందుబాటులో ఉంటాయి. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించారు. కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధుల వినియోగానికి అనుమతి ఇచ్చారు. ఇలా మొత్తం 17 జిల్లాలకు రూ.37 కోట్ల అత్యవసర నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
* వైద్య సేవలు, అత్యవసర మరమ్మతులు..
వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస శిబిరాల్లో ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. బాధితులకు తాగునీరు, ఆహారం, పాలు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు అందించాలని పేర్కొంది. శిబిరాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. తుఫాన్, భారీ వర్షాల కారణంగా దెబ్బతినే రహదారులు, సాగునీటి మౌలిక సదుపాయాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్ల వినియోగానికి అవసరమైన కిరోసిన్, పెట్రోల్, డీజిల్ సమకూర్చుకోవాలని తెలిపింది. అవసరమైన చోట్ల దీపాలు, కొవ్వొత్తులు వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
* బాధితుల తరలింపునకు ఆర్టీసీ బస్సులు..
ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన మేరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. ఇందుకు సంబంధించిన చార్జీలను ఆర్టీసీకి చెల్లించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. పునరావాస శిబిరాల్లో స్థలం సరిపోని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కూడా తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలుగా వినియోగించుకోవచ్చని తెలిపింది. రోడ్లపై కూలిన చెట్లను తొలగించేందుకు రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహకారం తీసుకోవాలని ఆదేశించింది.
* గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు..
భారత వాతావరణ శాఖ బులెటిన్‌ను ఉటంకిస్తూ, మురసు తీవ్ర తుఫాన్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. తుఫాన్ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని అంచనా వేసినట్లు వివరించింది.
ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన నిత్యావసరాలు, వైద్య సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

