Telangana is set to host the Khelo India Youth Games from December 11 CM Revanth Reddy Review
* డిసెంబర్ 11 నుంచి 20 వేదికల్లో 27 క్రీడాంశాలు..
* యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణే లక్ష్యం
* ఖేలో ఇండియా నిర్వహణపై సీఎం సమీక్ష..
* అధికారులకు కీలక ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో నిర్వహణ ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు.
* ఆరు నగరాలు.. 20 వేదికలు.. 27 క్రీడాంశాలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు పాల్గొననున్నారు. సుమారు 2 వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు కూడా ఈ పోటీలకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరో ఐదు నగరాల్లో మొత్తం 20 వేదికలపై 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
* కర్రసాము క్రీడకు చోటు కల్పించాలి..
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉన్న కర్రసాము క్రీడను ఆతిథ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా పోటీల్లో చేర్చేలా వెంటనే కార్యాచరణ చేపట్టాలని రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ క్రీడల ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
* గ్రూప్-1 అధికారులకు బాధ్యతలు
పోటీల నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ కోసం గ్రూప్-1 స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆదేశించారు. వివిధ జిల్లాల్లో పోటీలు జరగనున్నందున స్థానికంగా పనిచేస్తున్న అధికారులను కూడా పర్యవేక్షణలో భాగస్వాములను చేయాలని చెప్పారు. క్రీడాకారులకు వసతి, ఇతర సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇకపై ప్రతి వారం క్రీడల ఏర్పాట్లు, పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
* ఆడంబరాలకు దూరంగా ప్రారంభ, ముగింపు వేడుకలు
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసరమైన ఆడంబరాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల కోసం సమకూర్చిన వనరులను ఈ క్రీడల నిర్వహణకు కూడా వినియోగించుకోవాలని చెప్పారు. క్రీడలు, క్రీడాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం కూడా గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాల్లో భాగమని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
* ఒలింపిక్స్ పతకాలే లక్ష్యం..
రానున్న రోజుల్లో ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచస్థాయి శిక్షణ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఈ దిశగా గొప్ప అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) ఎ. వాణీ ప్రసాద్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ ఎ. సోనిబాలా దేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

