ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ముందు లొంగుబాటు
మూడు దశాబ్దాల అజ్ఞాతం వీడిన ఇమాంబీ
ఆకేరు న్యూస్ , వరంగల్ : సీపీఐ మావోయిస్ట్ నేత షేక్ ఇమాంబీ అలియాస్ జ్యోతక్క మంగళవారం మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ( Mahabubabad SP ) ముందు లొంగిపోయారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఇమాంబీ అజ్ఞాతంలో ఉన్నారు. ఇపుడు ఆమె వయసు 62 సంవత్సరాలు . దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ టైలరింగ్ విభాగంలో పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం హరిపిరాల కు చెందిన ఇమాంబీని బాల్యంలోనే మేనత్త దత్తత తీసుకుంది. ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ గ్రామంలో మేనత్త దగ్గరనే పెరిగింది. సమీప బంధువు షేక్ ఇమామ్ ద్వరా నక్సలైట్ కార్యకలాపాలు పరిచయం అయినాయి. నర్సంపేట, పరకాల, చేర్యాల తదితర నక్సల్ దళాల్లో పనిచేసిందని పోలీసులు వెల్లడించారు. ఈ కాలంలో పోలీస్లతో జరిగిన ఎదురుకాల్పుల్ల ఘటనల్లో పాల్గొన్నదని తెలిపారు. కాలం చెల్లిన మావోయిస్ట్ పార్టీ సిద్దాంతాలతో విసిగి పోయి ఇమాంబీ అజ్ఞాతవాసం వీడిందని, ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్న నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ రాంనాథ్ కేకన్ ( Sudheer Ramnath Kekan IPS ) పిలుపునిచ్చారు. సరెండర్ కమ్ పునరావాసం విదానంలో భాగంగా ప్రభుత్వం లొంగిపోయిన నక్సలైట్లను ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్య పాల్గొన్నారు.
—————