* ఇంత కాలం నమ్మిన సిద్దాంతం గెడెన్స్ గా ప్రజల కోసం పనిచేస్తాను.
* విలేకరుల ప్రశ్నలకు ఇప్పుడు వివరంగా చెప్పలేను
– మాజీ మావోయిస్ట్ తిప్పిరి తిరుపతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీపీఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటి ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ , పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ , మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు నూనే నర్సింహా రెడ్డి అలియాస్ గంగన్న లు పోలీసుల ముందు లొంగి పోయారు. ఇటీవలి కాలంలో వీరంతా లొంగి పోతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది.
* ప్రజల కోసం పనిచేస్తాను..
అనారోగ్య కారణాల రీత్యా తాను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు దేవ్జీ తెలిపారు. కేవలం వ్యక్తిగత జీవితం గడపడానికి తాను బయటకు రాలేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన పద్ధతుల్లో (Legal Framework) తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడి తాను నమ్మిన సిద్ధాంతాన్ని గైడెన్స్గా తీసుకుని భవిష్యత్తులో పని చేస్తానని చెప్పారు .విలేకరులు అడిగే ప్రశ్నలకు ఇప్పుడు సంక్షిప్తంగా సమాధానం ఇస్తే అపార్థాలకు దారి తీసే అవకాశం ఉందని, అందుకే భవిష్యత్తులో ఇంటర్వ్యూల ద్వారా అన్ని విషయాలను సమగ్రంగా వివరిస్తానని కోరారు తన రాజకీయ ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఎక్కువ వివరాలు వెల్లడించడం లేదని అపీల్ చేశారు.
* మావోయిస్ట్ పార్టీలో ఇంకా మిగిలే ఉన్నారు..
ఒక వైపు పార్టీ అగ్ర నేతల వరుస బెట్టి లొంగిపోతుంటే మరి కొంత మంది ఇంకా మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. చత్తీష్ ఘడ్ రాష్ట్రానికి చెందిన పాపారావు రాష్ట్ర కమిటీ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి ఇంకా 11 మంది మావోయిస్ట్ పార్టీ లో వివిద హోదాల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ డీజీపీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. వాళ్ళను కూడా లొంగి పోయే విదంగా చూస్తామని డీజీపీ ప్రకటించారు. మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఉన్నారు. కాగా గణపతి చత్తీష్ ఘడ్లో లేరని తెలుస్తుందన్నాడు. పసునూరి నరహరి , ముప్పిడి సాంబయ్య తదితరులు 11 మంది ఉన్నారని చెప్పారు.
* మావోయిస్ట్ పార్టీ ప్రస్థానం ముగిసినట్లేనా..?
సీపీఐ మావోయిస్ట్ పార్టీ ఆపరేషన్ కగార్ తో కకావికలం అయింది. భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు, అత్యంత ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు ఇతర సాంకేతిక పరికరాలతో మావోయిస్ట్ పార్టీ దళాలపై విరుచుకుపడ్డాయి. దీంతో సీపీఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్ కౌంటర్లో మృతి చెందారు. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయి నాయకుడు ఎన్ కౌంటర్లో మృతి చెందలేదు. మావోయిస్ట్ పార్టీ దళపతి బసవరాజును కోల్పోవడంతో మావోయిస్ట్ పార్టీ కేడర్లో ఒక్కసారిగా నిస్పృహ అలుముకున్నది. మరోవైపు ఎన్ కౌంటర్ ల పరంపర కొన సాగడం పెద్ద ఎత్తున పీఎల్ జీఏ దళాలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆపరేషన్ కగార్ తో చత్తీష్ ఘడ్లో ఏకంగా శత్రు దేశాలతో జరిగినట్లుగా ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. దీనికి తోడు పోలీస్ అధికారులు కేడర్ కాకుండా లీడర్ టార్గెట్గా ఆపరేషన్లను విస్తృతం చేశారు. ముఖ్యంగా పార్టీ రెండో అత్యున్నత శ్రేణి నాయకత్వం సెంట్రల్ కమిటీ నాయకులే లక్ష్యంగా వేట కొనసాగింది. అందులో విజయమూ సాధించగలిగారు. కేంద్ర కమిటి సభ్యులు వివేక్ , చలపతి, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కాతా రామచంద్రా రెడ్డి అలియాస్ రాజు ,సహదేవ్ సోరెన్ లు ఎన్ కౌంటర్లో మృతి చెందారు. అన్నిటికి మించి మావోయిస్ట్ పార్టీని అతలాకుతలం చేసింది హిడ్మా ఎన్ కౌంటర్ . హిడ్మా ఆదివాసీ ప్రజల్లో , మావోయిస్ట్ పార్టీ కేడర్లో బాగా పట్టు ఉన్న వ్యక్తి. హిడ్మా ఎన్ కౌంటర్ జాతీయ, అంతర్జాతీయంగా కూడా చర్చ నీయాంశమైంది. వరుస నష్టాలతో కోలుకోలేని స్థితికి మావోయిస్ట్ పార్టీ చేరుకున్నది. మిగిలిన కేంద్ర కమిటీ నాయకుల్లో పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ , మల్లా రాజిరెడ్డిలు మాత్రమే మిగిలారు. పాపారావు, నర్సింహరెడ్డి లాంటి కొద్ది మంది నాయకులతో పాటు 300 మంది వరకు పీఎల్ జీఏ సభ్యులు మిగిలారని పోలీసులు భావించారు. ఇక దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు కూడా లొంగిపోవడంతో మావోయిస్ట్ పార్టీ దాదాపు 45 ఏళ్ళ ప్రస్థానం ముగిసినట్లు అయింది.
————————————-
