* మా ప్రాంతంలో పరిశీలించలేదంటున్న స్థానికులు
* అభ్యంతరాలు తెలుపుతూ ఫిర్యాదులు
* మ్యాపులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
హైదరాబాద్ మహా నగరాన్ని మహ మహా నగరంగా మార్చే క్రమంలో లోటుపాట్లు వెలుగులోకి వస్తున్నాయి. విభజన తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొత్త డివిజన్ల డిమాండ్‌తోను, ఉన్నవాటిని ముక్కలు చేయవద్దు అంటూ కొందరు.. పునర్విభజన శాస్త్రీయంగా లేదని ఇంకొందరు ఆందోళనలు చేపడుతున్నారు. విస్తరిత జీహెచ్ఎంసీ పునర్విభజనపై గందరగోళం నెలకొంది. డివిజన్ల వారీగా సరిహద్దులను ముసాయిదా ప్రాథమిక నోటిఫికేషన్లో ప్రకటించారు. డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల వివరాలు బహిర్గతం చేయలేదు. మ్యాపులూ విడుదల చేయలేదు. కనీసం పోలింగ్ కేంద్రాల వివరాలూ వెల్లడించలేదు. దీంతో ఏ ప్రాంతం ఏ డివిజన్ పరిధిలో ఉందో తెలియక ప్రజలు, పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు.
ఆరోపణల వెల్లువ
ఔటర్ రింగు రోడ్డు హద్దుగా ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలుపుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. విభజన ప్రక్రియ అనంతరం డివిజన్లు ఏర్పాటు చేసిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమ ప్రాంతాల పరిఽధుల్లో క్షేత్రస్థాయిలో జీహెచ్ఎంసీ అధికారులు పర్యటించకుండానే విభజన ప్రక్రియను చేపట్టారని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే వార్డుల విభజనలో శాస్త్రీయత లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్ వంటి మునిసిపాలిటీల్లో గేటెడ్ కమ్యూనిటీలతో పాటు, హైరైజ్ అపార్టుమెంట్ ప్రాజెక్టులు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి మునిసిపాలిటీల్లో తక్కువ సంఖ్యలో వార్డులను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖలు అందజేస్తున్నారు.
కోర్టుకెళ్తాం..
జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా డివిజన్ల విభజన జరిగిందని అధికారులు చెబుతుంటే, వివరాల సేకరణ సక్రమంగా జరగలేదని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు చెబుతున్నారు. అలాగే సంబంధిత ఏరియాల మ్యాపులు విడుదల చేయకుండా అధికారులు గోప్యత ప్రదర్శించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన కేపీహెచ్‌బీ కాలనీని మూడు డివిజన్లలో కలపడంపై తెలుగుదేశం నాయకులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ అంశంపై న్యాయపరంగా కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఇవిగో ఉదాహరణలు
హస్తినాపురం డివిజన్లో ఆ ఏరియా లేదు. బైరామల్‌గూడ డివిజన్లో హస్తినాపురం ఏరియా ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని బలరాంనగర్ డివిజన్ పేరును నేరేడ్మెట్గా మార్చాలనే డిమాండ్ ఉంది. అడిక్‌మెట్ డివిజన్లో 39 బూత్‌లు 40 వేల ఓట్లు ఉండగా, బాగ్‌లింగంపల్లి డివిజన్లో 23 బూత్‌లతో 25 వేలు, ముషీరాబాద్ డివిజన్లో 22 బూత్‌లు 25 వేల ఓట్లతో ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీలో విలీనం చేసిన తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఎల్బీనగర్ జోన్ కలపాలని డిమాండ్‌తో కోహెడ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరహార దీక్షలు చేపట్టారు. కోహెడ ఈధమ్మ గుడి వద్ద అఖిల పక్షం నేతలు దీక్షలను ప్రారంభించారు.
……………………………………….

