* హైకోర్టును ఆశ్రయించిన మెగాస్టార్
* నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తన ఇంటి నిర్మాణ పునరద్దరణకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న దరఖాస్తుపై జీహెచ్ ఎంసీ (GHMC) స్పందించడం లేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ ప్రముఖ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్ (నిలుపుగోడ) క్రమబద్ధీకరణ కోసం 2025 జూన్ 5న జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఆయన దరఖాస్తుపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీన్ని సవాలు చేస్తూ చిరంజీవి (CHIRANJEEVI) హైకోర్టు(HIGHCOURT)లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2002లోనే జీ+2 ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ పనులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమేనని, ఈ నిర్మాణాలను తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. చిరంజీవి దరఖాస్తుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ దరఖాస్తుపై జీహెచ్ఎంసీ చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో పిటిషన్పై విచారణను మూసివేశారు.
…………………………………….
