
-కలెక్టరేట్ ఎదుట ధర్నా
-కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
ఆకేరు న్యూస్, జనగామ: గోదావరి జలాలు లిఫ్టింగ్ చేసి దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ ప్రాంతంలోని చెరువులు కుంటలు నింపి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో జనగామ జిల్లాలోని చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కు అందజేశారు. సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ
జనగామ ప్రాంతం భారతదేశంలో అతి ఎత్తైన ప్రాంతంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. వాతావరణ శాఖ రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదు అవుతుందని సూచించడంతో రైతులు రోహిణి, మృగశిర కార్తెలలో పెద్ద ఎత్తున పత్తి విత్తనాలను విత్తుకున్నారని అన్నారు. వర్షాలు లేక అట్టి విత్తనాలు మొలకెత్తక ఒక్కొక్క రైతు 5000 నుంచి 10000 రూపాయల వరకు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండు చేశారు, భూగర్భ జలాలు అడుగంటి పోవడం వలన బోరు బావులు పూర్తిగా ఎండిపోయాయని, నారు పోసుకున్న రైతులు పదివేల రూపాయల వరకు నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని, జిల్లా వ్యాప్తంగా 9 రిజర్వాయర్లు, 723 చెరువులు కుంటలు ఉన్నాయని వీటిని నింపాలని అన్నారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపితే భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు అడుగంటి పోకుండా ఉంటాయన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల లోటు ఏర్పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపిస్తూ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటిని లిఫ్టింగ్ చేయకుండా తప్పించుకొని రాజకీయాలు చేస్తూ రైతాంగాన్ని పెద్ద ఎత్తున నష్టపరుస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ద్వారా లిఫ్టింగ్ చేసి జిల్లాలోని చెరువులు కుంటలు నింపడానికి నీటిని విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తిచేయాలని కోరారు. కాలువల నిర్మాణానికి గత ప్రభుత్వం సేకరించిన భూముల్లో త్వరగా కాలువలు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోతుకనూరి ఉపేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య , గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ఉర్సుల కుమార్ కర్రి సత్తయ్య , రాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………..