
* ఉభయ సభలు సజావుగా సాగడానికి అందరూ సహకరించాలి
* అసెంబ్లీ మీడియా సలహా కమిటీ తొలి సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శాసనసభ సమావేశాల సమయంలోనే కాకుండా, ఇతర సందర్భాల్లోనూ శాసనసభ కు సంబంధించిన వార్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మీడియాకు శాసనభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasadkumar)విజ్జ్ఞప్తి చేశారు. ఉభయ సభలు సజావుగా సాగడానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన మీడియా అడ్వైజరీ కమిటీ (Assembly Media Advisory Committee) తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా కమిటీ చైర్మన్, కో చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు పుషగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన శాసనసభ, మండలి గౌరవం, ప్రాధాన్యతలను కాపాడుతూ మీడియా సలహా మండలి ద్వారా మీ వంతుగా సేవలను అందించడం మంచి అవకాశం అని చెప్పారు. సీనియర్ జర్నలిస్టులుగా మీరు ఎంతో అనుభవం ఉన్నవారని, ఉభయ సభలు సజావుగా జరగడానికి తమ వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందించాలని కోరారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukendrareddy) మాట్లాడుతూ.. శాసన సభ , శాసన మండలి సమావేశాలు సజావుగా నడవాలి అంటే మీడియా పాత్రనే కీలకమని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభను హుందాగా నడవడానికి అన్ని విధాలుగా సహకారం అందించాలని, రానున్న రోజుల్లో శాసన సభ , శాసన మండలి ఒకే భవనంలోకి రాబోతున్నాయి కావున కొన్ని చేంజెస్ కూడా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీడియా కమిటీ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు (Sridharbabu) మాట్లాడుతూ… శాసనసభ, శాసన మండలి వ్యవహారాలలో మీడియాకు బాధ్యతను కల్పించడానికి, మరింత పాత్రను పోషించడానికే మీడియా అడ్వైజరీ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఉభయ సభల నిర్వాహణలో అందరి సహకారాన్ని కోరారు. సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు, వసతులపై ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమావేశాల సందర్భంగా జారీ చేసే పాస్ ల విషయంలో కమిటీ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, మంచి వాతావరణంలో సమావేశాలు జరిగే విదంగా అందరం కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సమావేశాల సందర్భంగా కవరేజ్ చేసే మీడియా ప్రతినిధులందరికి పాస్ లు అందే విధంగా సూచనలను అందిస్తామని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులకు అవసరమయ్యే సౌకర్యాలపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సూచనలను చేస్తామని తెలిపారు.
……………………………………………