Engagement Poster Marriage Drama
ఆకేరు న్యూస్, రాజన్న సిరిసిల్ల: పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా హైడ్రామా నెలకొంది. నిశ్చితార్థం వేడుక జరగాల్సిన సమయానికి కొన్ని గంటల ముందు వెలిసిన కొన్ని పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇరు కుటుంబాల్లో తీవ్ర కలకలం రేపాయి. చివరకు ఈ వ్యవహారం కాస్తా పెళ్లి రద్దుకు దారితీసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో చోటుచేసుకుంది.
* అర్ధరాత్రి కారులో వచ్చి..
తంగళ్లపల్లికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. ఇందులో భాగంగా ఇంట్లో నిశ్చితార్థ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత సిద్ధిపేటకు చెందిన ఓ యువకుడు కారులో అక్కడకు చేరుకున్నాడు. సదరు యువతి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలను అంటించాడు.
* ఏడేళ్ల ప్రేమాయణం..
ఆ పోస్టర్లలో సంచలన విషయాలు రాసి ఉన్నాయి. “మేమిద్దరం గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం” అని సదరు యువకుడు ఆ ఫ్లెక్సీలలో పేర్కొంటూ తన ప్రేమ కోసం నిరసన తెలిపాడు. తెల్లవారుజామున లేచి చూసిన స్థానికులు, వధువు కుటుంబ సభ్యులు ఆ పోస్టర్లను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, యువకుడు అర్ధరాత్రి కారులో వచ్చి పోస్టర్లు అంటిస్తున్న దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
* పెళ్లి రద్దు.. పోలీసులకు ఫిర్యాదు..
ఈ ఊహించని పరిణామంతో వధువు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిశ్చితార్థం సమయానికి ఈ రచ్చ జరగడంతో మనస్తాపానికి గురై, పెళ్లిని క్యాన్సిల్ (రద్దు) చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం ఈ ఘటనపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సిద్ధిపేటకు చెందిన ఆ యువకుడిపై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
