గ్రేటర్ వరంగల్లో నిలిచిన ‘బల్దియా’ చక్రాలు…
డీజిల్ లేక మూలన పడ్డ చెత్త వాహనాలు!
ఆకేరు న్యూస్, వరంగల్: చారిత్రక నగరం వరంగల్లో పారిశుధ్య వ్యవస్థ తీవ్ర సంక్షో
భంలో పడింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) వాహనాలకు డీజిల్ కష్టాలు వచ్చి పడ్డాయి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించకపోవడంతో, పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఇంధన సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా నగరంలో చెత్త సేకరణ ఎక్కడికక్కడే ఆగిపోయింది.
రూ. 2.50 కోట్ల బకాయిలు.. తెగేసి చెప్పిన జైళ్ల శాఖ:
బల్దియా వాహనాలకు నగరంలోని సెంట్రల్ జైలు ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఇంధనం సరఫరా అవుతుంది. అయితే, గత కొంతకాలంగా కార్పొరేషన్ సుమారు రూ. 2.50 కోట్ల మేర బకాయిలు పెట్టింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా నిధుల విడుదల కాకపోవడంతో, జైళ్ల శాఖ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే ఇంధనం పోస్తామని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సిబ్బందికి కరాఖండిగా చెప్పారు.
స్తంభించిన పారిశుధ్యం… ముదురుతున్న దోమల సమస్య
డీజిల్ లేకపోవడంతో గత కొన్ని రోజులుగా చెత్త తరలింపు వాహనాలు, ట్రాక్టర్లు షెడ్లకే పరిమితమయ్యాయి. ఇంటింటి నుండి సేకరించిన చెత్తను తరలించే మార్గం లేక వీధులన్నీ చెత్తకుప్పలుగా మారుతున్నాయి. కేవలం పారిశుధ్యమే కాకుండా, దోమల నియంత్రణకు ఉపయోగించే ఫాగింగ్ మిషన్లు కూడా ఇంధనం లేక మూలన పడ్డాయి. దీనివల్ల నగరంలో దోమల బెడద విపరీతంగా పెరిగింది.
ప్రజల ఆందోళన..
వేసవి కాలం ప్రారంభమవుతున్న తరుణంలో ఇలా పారిశుధ్యం పడకేయడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువలు నిలిచిపోవడం, చెత్త పేరుకుపోవడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, కనీసం వాహనాలకు డీజిల్ పోయించలేని స్థితికి చేరుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బకాయిలు చెల్లించి, నగర పారిశుధ్య పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
