Wife hired killers murder
ఆకేరు న్యూస్ హన్మకొండ : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన హన్మకొండ జిల్లా పరకాలలో వెలుగుచూసింది. తన సుఖానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించిన భార్య ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
*నరేష్‌తో వివాహేతర సంబంధం
పరకాల పట్టణానికి చెందిన మడికొండ సుమన్ భరత్ (38), లావణ్య దంపతులకు 2012లో వివాహం కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే లావణ్యకు అదే ప్రాంతానికి చెందిన ఇమ్మడి నరేష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో భర్త భరత్ తరచూ ఆమెను మందలించడంతో పాటు కొట్టేవాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని లావణ్య నిర్ణయించుకుంది.
*రూ. 5 లక్షల సుపారీతో హత్య ప్లాన్
తమ దారికి అడ్డుగా ఉన్న భరత్‌ను చంపేందుకు లావణ్య తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు ఇమ్ముడి నరేష్లతో కలిసి పథకం రచించింది. ఇందుకోసం ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి రూ. 5 లక్షల సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లావణ్య తన బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 1.59 లక్షలు, నరేష్ రూ. 2 లక్షలు, రాజు రూ. 1 లక్ష పోగు చేసి మొత్తం రూ. 4.59 లక్షలను కిరాయి హంతకులకు అందజేశారు.
*పథకం ప్రకారమే హత్య
పథకం ప్రకారం ఏప్రిల్ 3వ తేదీ రాత్రి, నిందితులు వెంకటేశ్వర్లు మరియు రాకేష్‌లు భరత్‌ను మద్యం తాగిద్దామని ములుగుకు పిలిపించుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న భరత్ తల వెనుక భాగంలో బీరు సీసాతో బలంగా కొట్టి కింద పడేశారు. అనంతరం అతను ప్రాణాలతో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఈ ఘాతుకాన్ని నిందితులు తమ ఫోన్లలో వీడియో కూడా తీశారు.
*భర్త కనిపించడం లేదంటూ లావణ్య నాటకం
హత్య జరిగిన మరుసటి రోజు లావణ్య, రాజు ములుగు వెళ్లి నిందితులకు మిగిలిన నగదు అందజేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఏప్రిల్ 5న వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి వెళ్లి, కాలిపోయిన అస్థికలను ఒక సంచిలో వేసి సమీపంలోని వాగులో పడేశాడు. భర్త కనిపించడం లేదంటూ లావణ్య నాటకమాడింది. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
*నేరం చేసిన వారి వివరాలు
నిందితులు మృతుడి భార్య మడికొండ లావణ్య, ఇమ్ముడి నరేష్ ( ప్రియుడు), పెండల రాజు (లావణ్య తమ్ముడు), చిరంశెట్టి వెంకటేశ్వర్లు , భూక్యా రాకేష్ ని అదుపులోకి తీసుకోని వీరి నుండి 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.
