Self Enumeration Public Use
ఆకేరు న్యూస్ , హనుమకొండ :
రాష్ట్ర వ్యాప్తంగా జరిగే జనగణన ప్రక్రియలో భాగంగా ఈనెల 26 నుండి ప్రారంభమవుతున్న స్వీయ గణన (Self Enumeration) అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి పిలుపు నిచ్చారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో స్వీయ గణన వివరాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు.
* స్వీయ గణన ఇలా నమోదు చేసుకోవాలి
ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చన్నారు.స్వీయ గణన కోసం ముందుగా https://se.census.gov.in� లింక్‌ను ఓపెన్ చేసి, “Self Enumeration Login” వద్ద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసి, క్యాప్చా నమోదు చేసి “Verify & Proceed” పై క్లిక్ చేయాలని తెలిపారు. అనంతరం కుటుంబ పెద్ద పేరు మరియు మొబైల్ నంబర్ నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలని సూచించారు.లాగిన్ అయిన తరువాత జిల్లా, గ్రామం, పిన్‌కోడ్ వంటి వివరాలను నమోదు చేసి, గూగుల్ మ్యాప్ ద్వారా తమ నివాస స్థలాన్ని గుర్తించాల్సి ఉంటుందన్నారు . కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు.పూర్తి వివరాలు నమోదు చేసిన తరువాత వాటిని మరోసారి పరిశీలించి సమర్పించవచ్చని తెలిపారు. సమర్పణ అనంతరం 11 అంకెల ఐడి నెంబర్ జనరేట్ అవుతుందని, ఆ ఐడిని భద్రపరచుకోవాలని సూచించారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి నెంబర్ చూపించినట్లయితే, వారు ధృవీకరించి ఫైనల్ చేస్తారని అదనపు కలెక్టర్ రవి వివరించారు. జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని స్వీయ గణనలో చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రామ్ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
