Maoist Mass Surrender Telangana
* 32 ఆయుధాలు అప్పగింత
* ఇక మిగిలింది నలుగురు మావోయిస్ట్‌లే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మావోయిస్ట్ పార్టీ ( Maoist Party ) కి మరో ఎదురు దెబ్బ తగిలింది. లొంగు బాట్ల పరంపర కొనసాగుతోంది. ఈ రోజు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు 47 మంది పీఎల్ జీఏ ( PLGA ) సభ్యులు , బెటాలియన్ -1 కు చెందిన ముఖ్య నాయకులు లొంగి పోయారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యులు, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన కీలక నేతలు లొంగిపోయిన వారిలో ఉన్నారని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న హేమ్లా ఐతు అలియాస్ విజ్జా, పోడియం లచ్చు అలియాస్ మనోజ్ లు లొంగిపోయారన్నారు. అత్యంత ఆధునిక మైన 32 ఆయుధాలు, 515 తూటాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో LMG, AK-47, INSAS, SLR రైఫిల్స్‌తో పాటు పిస్టల్స్, రివాల్వర్, మస్కెట్ గన్స్ వంటి వివిధ రకాల ఆయుధాలు ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం కారణంగా ఈ మావోయిస్టు కేడర్లు లొంగుబాటుకు ముందుకొచ్చారని చెప్పారు.
* ఇక మిగిలిందే నలుగురే .. లొంగిపోండి..
తెలంగాణకు చెందిన నలుగురు కీలక మావోయిస్టు నాయకులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వారిలో మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి, జాడి రత్నాభాయ్ అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు ఉన్నారన్నారు. ఈ నలుగురు కూడా జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని డీజీపీ పిలుపు నిచ్చారు. తెలంగాణ పోలీసుల సమర్థవంతమైన పనితీరు వల్ల ఇప్పటి వరకు
మొత్తం 818 మంది మావోయిస్టులు లొంగిపోగా, వారి నుంచి 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు .
————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
