* రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి విద్యార్థి నాయకుల ఫిర్యాదు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : హరికోట్ల అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని శనివారం రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి విద్యార్థి నాయకులు డీఎమ్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు దూడపాక నరేష్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హరికోట్ల రవి మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా సుదీర్ఘంగా 15 సంవత్సరాల కాలం పాటు పని చేసి, ప్రభుత్వ, ఆబాది భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసి, అక్రమంగా, పేదలను దోచుకొని కోట్ల రూపాయలు సంపాదించారని వారు చెప్పారు. అతని అక్రమాస్తులు, అవినీతిపై వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎమ్ఎస్ఏ, డీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని విద్యార్థి నాయకులు సెక్రటేరియట్ లో కలిసి ఫిర్యాదు చేశారు. వరంగల్ రిజిస్ట్రార్ గా పనిచేసిన కాలంలో కూడా స్పెషల్ డాక్యుమెంట్ల పేరుతో లక్షల రూపాయలు దోచుకున్నారని తెలిపారు. అంతేకాకుండా ఏజెంట్ వ్యవస్థను పట్టించుకోకుండా గజానికి 200 రూపాయల అదనపు చార్జీలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. గతంలో వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ గా పని చేసిన కాలంలో జిల్లా కలెక్టర్ కు, రాష్ట్ర డీఐజీ, కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. ఒక అధికారిగా ఒకే చోట 15 సంవత్సరాలు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటిపై వెంటనే విచారణ జరిపి హరికోట్ల రవిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి విచారణ జరపడానికి ఆదేశిస్తానని, త్వరలో ఎంక్వైరీ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎమ్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు దూడపాక నరేష్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
——————————