Harish Rao 22A Land Issue Telangana
* 30 శాతం కమీషన్ సర్కార్ అంటూ హరీశ్‌రావు ఫైర్
అకేరు న్యూస్ హైదరాబాద్: తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ప్రైవేట్ ఆస్తులు, కాలనీలు, గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలో పరిష్కారమైన భూములను సైతం 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
22A నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఏళ్లుగా ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్న కుటుంబాల ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమన్నారు. ముఖ్యంగా గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద పరిష్కారమైన భూములను తిరిగి 22Aలో చేర్చడంపై ఆయన ప్రశ్నలు సంధించారు.
ఇది 30 శాతం కమీషన్ సర్కార్ అంటూ హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు మధ్యవర్తుల ద్వారా భారీ మొత్తాల్లో డిమాండ్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. కృత్రిమ వివాదాలు సృష్టించి సెటిల్మెంట్లకు మార్గం సుగమం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలకు స్వతంత్ర విచారణ అవసరమని ఆయన డిమాండ్ చేశారు.
బినామీలతో సెటిల్మెంట్ల దందాకు తెరలేపారని, ప్రజల ఆస్తులపై అనిశ్చితి సృష్టించడం వల్ల సాధారణ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హరీశ్‌రావు అన్నారు.
రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆస్తులు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
22A నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, తొలగించిన భూములపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అలాగే మొత్తం వ్యవహారంపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
బాధితుల ఆస్తులను కాపాడే బాధ్యత బీఆర్ఎస్దేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 22A జాబితాలో చేరిన అర్హత కలిగిన ప్రైవేట్ ఆస్తులను వెంటనే పరిశీలించి తొలగించాలని, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే, కొన్ని ప్రైవేట్ భూములు అధికారుల తప్పిదాల కారణంగా 22A జాబితాలో చేరాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రైవేట్ భూములను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దీంతో 22A వివాదం రాజకీయ ఆరోపణలు, ప్రభుత్వ వివరణల మధ్య మరింత ఉత్కంఠగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
