* రైతు బోనోతు వీరన్న ఆత్మహత్యపై హరీష్ రావు
* ఎక్స్ వేదికగా ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందనడానికి ఖమ్మం జిల్లా కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మ హత్యే నిదర్శనమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వీరన్నది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని హరీష్ రావు మండిపడ్డారు. కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శమని హరీష్ పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ.15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారని అన్నారు.సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు? అని హరీష్ ప్రశ్నించారు.రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని సీఎం రేవంత్ పరామర్శించి ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని హరీష్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
………………………………………….
