
– వరంగల్ ఎంజీఎం ఘటన.. వెలుగులోకి విస్తుపోయే విషయం
– మృతదేహాలు తారుమారు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాల తారుమారు ఘటనలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఓ బాధితుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్థానిక పోలీసులకు ఔట్ పోస్ట్ పోలీసులు తప్పుగా సమాచారం అందించడంతో పొరపాటు జరిగింది. బాధితులు, పోలీసు కథనం ప్రకారం.. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన రమకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె కు చెందిన గోక కుమారస్వామి(55)తో 35 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె ఉన్నది. జీవనోపాధి కోసం కొంతకాలం వీరు సూరత్‌కు వెళ్లగా కుమారస్వామి మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. కుమారస్వామి తొర్రూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న క్రమంలో ఈ నెల 9న వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి సమీపంలో గాయపడగా పోలీసులు (Warangal)వరంగల్ ఎంజీఎం(MGM Hospital)కు తరలించారు. అయితే అధికారుల సమన్వయ లోపంతో అతడు మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియల సమయంలో మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతడు తన తండ్రి కాదని కుమార్తె చెప్పడంతో అందరూ విస్తుపోయారు. అసలేం జరిగిందో అధికారులు విచారణ జరిపితే.. జూలై 9న రైలు పట్టాలపై గాయాలతో పడివున్న వ్యక్తిని వరంగల్ రైల్వే పోలీసులు 108 అంబులెన్సులో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో తొర్రూరు నుంచి మరో వ్యక్తిని స్పృహ కోల్పోయిన స్థితిలో హాస్పిటల్‌కు వచ్చారు. అయితే రైల్వే పోలీసులు తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులకు అందించాల్సిన సమాచారాన్ని ఔట్ పోస్ట్ పోలీసులు తొర్రూరు పోలీసులకు అందించారు. ఈ నేపథ్యంలో సమస్య ఉత్పన్నమైంది.
………………………………………….