* పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తత
* తాడిపత్రిలోనూ అంతే..
* రంగంలోకి కేంద్ర బలగాలు
* పెద్దిరెడ్డి, చంద్రారెడ్డిలను ఇతర ప్రాంతాలకు తరలించిన పోలీసులు
ఆకేరు న్యూస్, విజయవాడ : పోలింగ్ రోజు కొన్నిచోట్ల మొదలైన టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణలు.. మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లా, నంద్యాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. ఆందోళనలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నేతలను మౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. తాడిపత్రిలో అయితే.. వైసీపీ, టీడీపీ టపాసులతో మరీ దాడులు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలతో స్థానిక వాతావరణం వేడెక్కుతోంది. పోలీసులు భారీ బలగాలతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.., ఏదో మూల ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
చంద్రగిరిలో నివురుగప్పిన నిప్పులా
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ కొనసాగుతోంది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన ఘటనతో ఇప్పటికీ స్థానిక వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ కూటమి నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పులివర్తి నాని కారు ధ్వంసం, గన్మెన్ ధరణికి తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేసి భయాభ్రాంతకులకు గురిచేశారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే.. పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. అభ్యర్థులను తిరగొద్దని చెబితే.. తాను వెళ్లిపోయాను.. కానీ తన ప్రత్యర్థి మాత్రం యథేచ్ఛగా తిరిగారన్నారు.
పల్నాడు జిల్లాలో హౌస్ అరెస్ట్ లు
పల్నాడు జిల్లాలో నేటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్రిక్తతలు చల్లారలేదు. దీంతో నేతలు బయట తిరగకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే కాసును, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకటరామిరెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. 144 సెక్షన్ విధించారు. టీడీపీ, వైసీపీ వర్గీయులు కనిపిస్తే పోలీసులు చెదరగొడుతున్నారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాడిపత్రిలో హైటెన్షన్
తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నిన్న స్థానిక కళాశాల గ్రౌండ్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలతో వాతావరణం వేడెక్కింది. దీంతో ఈరోజు భారీగా కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేశాయి. ఘర్షణలను అడ్డుకట్ట వేసేందుకు ప్రధాన నేతలు పెద్దిరెడ్డి, చంద్రారెడ్డిలను ఇతర ప్రాంతాలకు తరలించారు.
——————————–