Gollala Gudi National Monument Status
* అరుదైన ఆలయానికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు
ఆకేరు న్యూస్ ,ములుగు: తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న చారిత్రక ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) ఆగస్టు 31, 2026న జారీ చేసిన నోటిఫికేషన్ను ‘గెజిట్ ఆఫ్ ఇండియా’ ప్రత్యేక సంచికలో ప్రచురించింది.
‘ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం–1958’లోని సెక్షన్ 4, ఉపసెక్షన్ (3) కింద సంక్రమించిన అధికారాలతో ఈ ప్రకటన జారీ చేసినట్లు ఏఎస్ఐ తెలిపింది. దీంతో ఈ చారిత్రక కట్టడం ఇకపై జాతీయ ప్రాధాన్య పురావస్తు కట్టడాల పరిరక్షణ పరిధిలోకి రానుంది.
* రామప్ప ఆలయానికి సమీపంలో..
పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ‘కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో గొల్లల గుడి ఉంది. కాకతీయుల ఆలయ నిర్మాణ శైలికి ప్రతీకగా నిలిచే ఈ కట్టడం శిల్పకళ, నిర్మాణ వైవిధ్యంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉన్న మండపంతో పాటు మూడు గర్భాలయాలను కలిగి ఉన్న త్రికూటాలయ నిర్మాణంగా కనిపిస్తుంది. ఆలయ ప్రహరీ, పైకప్పు అంచులు, ద్వారబంధాలపై కనిపించే శిల్పాలు నాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటుతున్నాయి. ముఖ్యంగా ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుస, సునిశితమైన రంధ్రాల వల పనితనం ఈ కట్టడానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
* శిల్పకళకు ప్రతీకగా..
ప్రధాన ఆలయానికి ముందు భాగంలో రెండు ఉప ఆలయాలు ఉన్నాయి. వీటి ద్వారాల వద్ద చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఉప ఆలయాల ముందు ఉన్న అంతరాలయాల అంచుల్లోనూ సున్నితమైన అలంకరణలు కనిపిస్తాయి.
ప్రధాన ఆలయంలోని మండపం నుంచి మధ్యలో ఉన్న ప్రధాన మందిరానికి ప్రవేశం ఉంటుంది. ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశల్లో అంతరాలయాలతో కూడిన మూడు గర్భాలయాలు ఉన్నాయి. ఆలయ కుడ్యాలపై ఏర్పాటు చేసిన వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గణేశుడు, మహిషాసురమర్దిని తదితర దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి.
జంతువుల ఆకృతులు, పుష్పాలంకరణలతో కూడిన ఎత్తైన వేదికపై ఆలయ నిర్మాణం చేపట్టారు. నిర్మాణంలో ఉపయోగించిన శిల్పాలు, అలంకరణలు కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన ప్రత్యేక దేవాలయ నిర్మాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
* పరిరక్షణకు మరింత ప్రాధాన్యం
జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు పొందడంతో గొల్లల గుడి సంరక్షణ, పరిరక్షణకు మరింత అధికారిక ప్రాధాన్యం లభించనుంది. రామప్ప ఆలయంతో పాటు పాలంపేటలోని కాకతీయుల కాలం నాటి ఇతర వారసత్వ కట్టడాల ప్రాముఖ్యతను కూడా ఈ గుర్తింపు మరింతగా వెలుగులోకి తీసుకురానుంది.
పాలంపేట ఇప్పటికే రామప్ప ఆలయం కారణంగా అంతర్జాతీయ పర్యాటక పటంలో స్థానం సంపాదించగా, గొల్లల గుడికి లభించిన జాతీయ ప్రాధాన్య హోదా ఈ ప్రాంతంలోని కాకతీయుల వారసత్వ సంపదపై ఆసక్తిని మరింత పెంచే అవకాశం ఉంది.
——–

Please tell us what is wrong. Your report will be sent to the website team.
