ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్.. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకూ రాని సరికొత్త కథతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రభాస్ (Prabhas)నటించిన కల్కి 2898 ఏడి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్లుగానే ఈ కథ కూడా ఉంటుంది. తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) సక్సెస్ అయ్యారు. కన్నార్పకుండా చూసేలా విజువల్స్ క్రియేట్ చేశారు. మంచి కోసం.. రేపటి కోసం.. అంటూ ఈ సినిమాలో ఓ గ్రూపు చేసే యుద్ధం లో ఎవరు విజయం సాధిస్తారనేది అద్భుతంగా తీర్చిదిద్దారు. సినీ ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లారు. కొత్తదనం, సోషియోఫ్యాంటసీ, మహాభారత కథ.. తదితర అంశాలపై ఆసక్తి ఉన్నవారిని కల్కి అద్భుతంగా ఆకట్టుకుంటుంది. సినిమా అంటే ఎమోషన్, కాసేపైనా ఉత్కంఠగా కట్టిపడేయాలి కదా.. అని ఆశపడే వారిని కాస్త నిరుత్సాహ పరుస్తుంది.
ఆ మూడు పాత్రల చుట్టే..
మహాభారతం చదివిన వాళ్లకు కల్కి తెలిసిన కథే. తన తండ్రి భీష్ముడిని చంపిన పాండవులపై అశ్వత్థామ దొంగ దెబ్బ తీయడం, కృష్ణుడి శాపంతో చావు లేక, చీము నెత్తురుతో గుహాల్లో తలదాచుకుంటూ బతకడం.. ఇక్కడి నుంచే కల్కి మొదలవుతుంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధం జరిగిన 5 వేల ఏళ్లకు సకల వైభోగాలు ఉన్న కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకునే ఓ యువకుడు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎలాగైనా భూమి మీదకి తీసుకు రావాలనుకునే గర్భవతి అయిన ఓ యువతి.. ఆమెకు రక్షణగా మారే అశ్వత్థామ.. కల్కి 2898 AD సినిమా అంతా ఈ మూడు పాత్రల చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది. ప్రథమాంకం స్లోగా మొదలుకావడం.., ప్రభాస్ ఎంట్రీ ఆలస్యంగా ఉండడం, సీరియస్ సన్నివేశాల్లో కూడా హాస్యం పండించే ప్రయత్నం చేయడం.. మైనస్ కాగా.., సెకండాఫ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇంటర్వెల్ ముందు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ప్రభాస్ మధ్య జరిగిన పైట్ ఆకట్టుకుంటుంది. ప్రధానంగా ఆఖరి 20 నిమిషాల సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ద్వితీయ భాగంపై అంచనాలను పెంచేసింది.
అంచనాలను అందుకుందా?
ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ. విడుదలకు ముందే దీనిపై భారీ అంచనాలు పెరిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ నాగ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు సినీ పరిశ్రమకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ సరికొత్త కథను ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు. బలమైన డ్రామా, కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తే.. ఈ సినిమా ఓ రేంజ్లో ఉండేది. స్లోగా కథ సాగుతున్న సమయంలో కాస్త ఉల్లాసం కోరుకునే ప్రేక్షకులకు అతిథిపాత్రలో కనిపించిన రాంగోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం సినీ మూడ్‌లోకి తీసుకొస్తారు. భైరవుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్‌బచ్చన్ నటన అద్వితీయం. బుజ్జి కారు (Bujji Car) ఈ సినిమాకు హైలెట్. త్రీడీలో సినిమా చూసే పిల్లలను కల్కి కచ్చితంగా ఆకట్టుకుంటాడు. మొత్తంగా ఓ విజువల్ వండర్ కల్కి 2898 ఏడి.!
————————