
* లింగాలగణపురం మండలం ఎనబావి గ్రామం పిట్టలోని గూడెంలో ఘటన
* హతుడికి ఇద్దరు భార్యలు
* దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఆకేరున్యూస్,జనగామః జనగామ జిల్లాలో దారుణం జరిగింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఎనబావి గ్రామం పిట్టలోని గూడెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాలియా కనుకయ్య అనే వ్యక్తిని అతని భార్యలే గొడ్డలితో నరికి చంపారు. వివరాల్లోకి వెళితే కాలియా కనుకయ్యకు ఇద్దరు భార్యలు. అక్కా చెళ్లిల్లు అయిన శిరీష (21) గౌరమ్మ (19)లను కనుకయ్య పెళ్లి చేసుకున్నాడు. అయితే గత మే నెల 18న కాలియా కనుకయ్య తన అత్త అంటే శిరీష, గౌరమ్మల తల్లి గుగులోతు జున్నుబాయిని యాదాద్రి జిల్లా మామిడితోటలో చంపాడు. కొంత కాలం జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు వచ్చాడు. తల్లి చనిపోయినప్పటి నుండి అతని భార్యలు శిరీష ,గౌరమ్మలు భర్తతో వెళ్లకుండా తల్లిగారి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే జైలునుంచి వచ్చిన కనుకయ్య తరచుగా పిట్టలగూడెం వస్తూ తాగి భార్యలను బెదిరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రి యథావిధిగా బాగా తాగి పిట్టలగూడెం చేరుకున్న కనుకయ్య గొడ్డలి తీసుకొని భార్యలపై దాడికి ప్రయత్నించగా ఇద్దరు అక్కచెళ్లిల్లు కలిసి గొడ్డలి లాక్కుని భర్తను నరికి చంపారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
…………………………………………………….