వీసీ సజ్జనార్ (ఫైల్ ఫోటో)
* భావోద్వేగ సందేశం ఇచ్చిన పోలీస్ కమిషనర్
* నూతన సీపీ మహేష్ భగవత్‌కు శుభాకాంక్షలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : చారిత్రక హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఏడాది కాలం పాటు పనిచేసిన తన ప్రయాణానికి ముగింపు పలుకుతూ ప్రస్తుత పోలీస్ కమిషనర్ (Hyderabad CP Farewell ) భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. హైదరాబాద్ నగర ప్రజలు చూపిన ఆదరాభిమానాలు, పోలీస్ సిబ్బంది అందించిన సహకారం, తన పదవీకాలంలో చేపట్టిన పలు సంస్కరణలు, సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. మధుర జ్ఞాపకాలతో హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి సెలవు (Hyderabad CP Farewell ) తీసుకుంటున్నట్లు వీసీ సజ్జనార్ (VC.Sajjanar) వెల్లడించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏడాది కాలం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అపురూపమైన ప్రయాణమని తెలిపారు. నూతన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ భగవత్ (Mahesh Bhagwat Hyderabad CP), ఐపీఎస్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
* ప్రజల సహకారమే పోలీసులకు బలం..
తన పదవీకాలంలో నగర ప్రజలు తనపై, పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. పోలీస్ శాఖ చేపట్టిన ప్రతి సంస్కరణను ప్రజలు తమ సొంత కార్యక్రమంగా భావించి ఆదరించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్‌లో అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ప్రతి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం నగర ప్రత్యేకతను చాటిందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.
* ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్‌తో ఉక్కుపాదం
ప్రజల ఆరోగ్యం, క్షేమమే లక్ష్యంగా పోలీస్ శాఖ పలు కీలక చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆహార కల్తీని అరికట్టేందుకు ‘హెచ్-ఫాస్ట్’ కార్యక్రమం ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భారీ మొత్తంలో కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు సహకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
* సైబర్ నేరాలపై ఆపరేషన్ ఆక్టోపస్
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడం ఒక్క పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని గుర్తించి, వివిధ ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ అందించిన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించడం ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందన్నారు. కేంద్ర హోం సెక్రటరీ స్థాయిలోనూ ఈ కార్యక్రమంపై ప్రశంసలు రావడం హైదరాబాద్ పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.
* బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక విభాగం
నేర బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలనే లక్ష్యంతో కేసుల దర్యాప్తును పర్యవేక్షించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ను ప్రారంభించినట్లు తెలిపారు. కేసుల పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ దర్యాప్తు ప్రక్రియను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ విభాగం ఉపయోగపడిందని వీసీ సజ్జనార్ వివరించారు.
* స్నేహభావం పెంచేందుకు ‘డే విత్ సీపీ’
భావితరాల్లో పోలీసుల పట్ల భయాన్ని తొలగించి, సమాజం పట్ల బాధ్యత, సేవాభావం పెంపొందించాలనే ఉద్దేశంతో ‘డే విత్ సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరును దగ్గరగా పరిచయం చేయడం, పోలీసుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. చిన్నారులతో గడిపిన సమయం తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చిందని భావోద్వేగంగా వెల్లడించారు.
* ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..
నగరంలో చాలాకాలంగా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే విధానాన్ని అమలు చేయడం మరో ముఖ్యమైన విజయమని సీపీ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల సహకారంతో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసి వాహనదారులకు ఉపశమనం కలిగించినట్లు తెలిపారు. నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ మార్పు ట్రాఫిక్ నిర్వహణలో కీలక ముందడుగుగా నిలిచిందన్నారు.
* మహిళల భద్రతకు ‘స్పందన’ వాహనాలు
మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు ‘స్పందన’ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మహిళల భద్రతను పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
* సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు..
పోలీస్ శాఖ సాధించిన విజయాల వెనుక ప్రతి ఒక్క పోలీస్ ఉద్యోగి కృషి, త్యాగం ఉన్నాయని సీపీ గుర్తుచేశారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రోత్సహించేందుకు ‘ఎక్స్ట్రా మైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే పోలీస్ సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.
శాంతిభద్రతలు, ట్రాఫిక్, సీఏఆర్, టాస్క్‌ఫోర్స్, సీసీఆర్బీ, ఎస్బీ, సీపీ కార్యాలయం, పరిపాలనా విభాగాలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డుల నుంచి అడిషనల్ పోలీస్ కమిషనర్ల వరకు ప్రతి ఒక్కరి సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ నగర ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహించిన సిబ్బంది సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
* ఉన్నతాధికారులు, మీడియాకు కృతజ్ఞతలు..
తన పదవీకాలంలో నిరంతరం మార్గదర్శనం చేసిన డీజీపీకి, ఇతర ఉన్నతాధికారులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సందర్భంలోనూ మీడియా అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
* మధుర జ్ఞాపకాలతో హైదరాబాద్‌కు వీడ్కోలు..
తనతో కలిసి పనిచేసిన పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నగర ప్రజలందరూ సురక్షితంగా, ప్రశాంతంగా జీవించాలని కోరుకున్నారు. ఏడాది కాలంలో ఎన్నో అనుభవాలు, మరపురాని జ్ఞాపకాలు, ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్నానని పేర్కొంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా (Hyderabad Police Commissioner VC.Sajjanar) తన బాధ్యతలకు వీడ్కోలు పలికారు. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో హైదరాబాద్ సీపీగా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ అంటూ తన సందేశాన్ని ముగించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

