Hyderabad Real Estate
Hyderabad Real Estate| ఆకేరు న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకాలు మందగిస్తున్నప్పటికీ హైదరాబాద్లో నిర్మాణాలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో పెరుగుతున్న ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను మరింత దూరం చేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో సగటు ఇంటి ధర అత్యధికంగా నమోదైనట్లు సీఆర్ఈ మ్యాట్రిక్స్ ఇండియా హౌసింగ్ రిపోర్టు-2026 వెల్లడించింది.
* రూ.2.02 కోట్ల సగటు ధర
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్-2026లో ఈ నివేదికను విడుదల చేశారు. జనవరి నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు సుమారు 2 శాతం తగ్గగా.. హైదరాబాద్లో మాత్రం 11 శాతం క్షీణించాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నగరంలో 28,190 ఇళ్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ సుమారు రూ.56 వేల కోట్లుగా నమోదైంది.
* 46,857 కొత్త యూనిట్లు
అమ్మకాలు తగ్గినప్పటికీ హైదరాబాద్లో నిర్మాణాలు పెరిగాయి. 2026 తొలి అర్ధభాగంలో 46,857 కొత్త యూనిట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 22 శాతం అధికం. 2023 తర్వాత ఇదే అత్యధిక నిర్మాణ ప్రారంభాలు కావడం గమనార్హం.
* 40 శాతం పెరిగిన ధరలు
దేశవ్యాప్తంగా సగటు ఇంటి ధర రూ.1.41 కోట్లు ఉండగా.. హైదరాబాద్లో అది రూ.2.02 కోట్లకు చేరింది. 2023లో నగరంలో సగటు ఇంటి ధర రూ.1.44 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ.2.02 కోట్లకు పెరిగింది. అంటే మూడేళ్లలో దాదాపు 40 శాతం పెరుగుదల నమోదైంది. గతేడాదితో పోలిస్తే సగటు ధర 13 శాతం పెరిగింది.
* లగ్జరీ ఇళ్ల వాటా పెరుగుతోంది
హైదరాబాద్లో రూ.1–2 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లు 32 శాతం, రూ.2–5 కోట్ల మధ్య ఉన్నవి 33 శాతం ఉన్నాయి. రూ.5 కోట్లకు పైబడిన లగ్జరీ ఇళ్ల వాటా 27 శాతానికి చేరింది. 2023తో పోలిస్తే లగ్జరీ ఇళ్ల నిర్మాణం 7 శాతం పెరిగింది. నిర్మాణ వ్యయం, భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అమ్మకాలు తగ్గినా ఇళ్ల ధరలు తగ్గే అవకాశం లేదని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా చైర్మన్ సుమంత్ రెడ్డి పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
