Hyderabad Police AI Complaint App
* మాతృభాషలో చెబితే చాలు ఫిర్యాదు నమోదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ సిటీ పోలీస్ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రజలకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత బహుభాషా ఫిర్యాదు నమోదు యాప్ ‘ఏఐ కాప్‌రైటర్’ (AI Copywriter) ను ప్రారంభించింది. బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) వేదికగా ఈ అత్యాధునిక అప్లికేషన్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
* మాతృభాషలోనే ఫిర్యాదు….
సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు, పర్యాటకులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేటప్పుడు భాషా పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యకు ‘ఏఐ కాప్‌రైటర్’ శాశ్వత పరిష్కారం చూపుతుంది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ మాతృభాషలో మాట్లాడితే, ఈ యాప్‌లోని అడ్వాన్స్డ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) టెక్నాలజీ ఆ మాటలను తక్షణమే వినడమే కాకుండా, అత్యంత ఖచ్చితమైన టెక్స్ట్‌గా మార్చి అనువదిస్తుంది. ఈ యాప్‌లో తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ సహా 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఉంది.
* ఎవరి స్టేట్మెంట్ వారికే స్పష్టంగా..
ఇందులో ఉన్న మరో అద్భుత ఫీచర్ ‘మల్టీ-పార్టీ లేబులింగ్’. ఒకే నేర సంఘటనకు సంబంధించి బాధితుడు, నిందితుడు, మరియు సాక్షులు మాట్లాడేటప్పుడు వారి వాయిస్ ఆధారంగా వేర్వేరు వ్యక్తులను యాప్ స్వయంచాలకంగా గుర్తిస్తుంది. ఎవరెవరు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో విడివిడిగా రికార్డ్ చేస్తుంది. ఫిర్యాదు ప్రక్రియ పూర్తయిన వెంటనే, సదరు అధికారి వివరాలు, ఖచ్చితమైన సమయంతో కూడిన నివేదిక ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ (PDF) రూపంలో భద్రపరచబడుతుంది. ఇది కేసు దర్యాప్తులో పోలీసులకు తిరుగులేని డిజిటల్ సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
* వలస కార్మికులు, పర్యాటకులకు పెరగనున్న భరోసా….
నగరంలో నివసిస్తున్న వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు మరియు వృద్ధులకు భాషా సమస్యలు లేకుండా వేగంగా పోలీసు సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఇది పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా అనువాదకుల (Translators) అవసరాన్ని తగ్గిస్తూ, ఫిర్యాదు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం, కచ్చితం చేస్తుంది.
* త్వరలోనే 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి…
తొలి విడతగా ఈ యాప్ త్వరలోనే హైదరాబాద్ వ్యాప్టానికి చెందిన 80కి పైగా పోలీస్ స్టేషన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. కాగా, హైదరాబాద్ పోలీస్ శాఖ ఇప్పటికే సైబర్ క్రైమ్ నియంత్రణకు ‘సి-మిత్ర’ (C-Mitra), సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ‘సాక్-ఐ’ (SAC-I) వంటి ఏఐ టూల్స్‌ను విజయవంతంగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి ‘ఏఐ కాప్‌రైటర్’ చేరడం టెక్-పోలీసింగ్‌లో సరికొత్త మైలురాయిగా నిలిచింది.
