* ఆ ఇళ్లను కూల్చబోమని ప్రకటన
* బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లు, స్థలాలు కొనొద్దు
* హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని నిర్మాణాలను కూలుస్తూ.. అక్రమ నిర్మాణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా (HYDRA)తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం కూడా దుండిగల్(DUNDIGAL) పరిధి బౌరంపేటలోని ఆరు విల్లాలను కూల్చివేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ సున్నం చెరువు(SUNNAM CHERUVU) ఎఫ్టీఎల్ పరిధిలో కూడా కూల్చివేతలు చేపట్టింది. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నారని పలువురు ఆందోళన చేపడుతున్నారు. కూల్చివేతలు ఆపాలని ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ కూడా పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, కొత్తగా చేపడుతున్న నిర్మాణాలతో పాటు ఎంతో కాలంగా నివాసం ఉంటున్న చాలా ఇళ్లకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో వారంతా కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA COMMISIONAR RANGANATH) కీలక ప్రకటన చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొత్తగా చేపడుతున్న నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని, ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని వెల్లడించారు. దీంతో చాలామందికి ఉపశమనం లభించినట్లు అయింది. కాగా, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లు, స్థలాలు కొనొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజలకు సూచించారు.
——————————