* తెలంగాణలో కాళేశ్వరం కట్టినా నేను అడ్డుచెప్పలేదు
* సమస్య పరిష్కారానికి సయోధ్య ముఖ్యం
* ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, అమరావతి : వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణలో జరుగుతున్న నీటి వివాదాలపై ఆయన స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఏపీ, టీజీ మధ్య జరుగుతున్న జల వివాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన బంధం మ, భవిష్యత్తు లక్ష్యాలపై కీలక ప్రసంగం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, విభజన సమస్యల కంటే సయోధ్యే ముఖ్యమని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా తాను అభ్యంతరం చెప్పలేదన్నారు. నీటి వినియోగం విషయంలో రాష్ట్రాల మధ్య గొడవలు కాకుండా, వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం జరగాల్సి ఉందని, దాంతోనే దేశం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. గంగా – కావేరి నదుల అనుసంధానం జరగాలని, తద్వారా దేశమంతా సస్యశ్యామలం కావాలని చంద్రబాబు కోరారు. తెలుగు రాష్ట్రాలు నీటి గొడవల్లో చిక్కుకోకుండా, పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అగ్రగామిగా ఉండాలన్నదే తన తపన అని ఆయన అన్నారు.

