
* అనుకోకుండా కాలు పెట్టిన గిరిజనుడు
* కాలు నుజ్జునుజ్జు.. ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
* పోలీసుల కోసం మావోయిస్టులు పెట్టినదిగా అనుమానం
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లాలో మరోసారి మందు పాతర పేలింది. కట్టెల కోసం కొండ పైకి వెళ్లిన గిరిజనుడు అనుకోకుండా మందుపాతరపై కాలు పెట్టడంతో పేలింది. దీంతో అతడికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లా (Mulugu District) అడవుల్లోకి 20 రోజులుగా కర్రెగుట్ట సహా సమీప ప్రాంతాల్లోని గుట్టలపై భద్రతా దళాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఈక్రమంలో గుట్టపై మావోయిస్టులు ( Maoists)పెట్టిన చాలా మందు పాతరలను నిర్వీర్యం చేశారు. కాగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చలిమెల గుట్లపై పెను ప్రమాదం సంభవించింది. భద్రతా బలగాల లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన చేసిన ఐఈడీ బాంబ్(Ied Bomb) పై కాలుపెట్టిన ఓ గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాలు నుజ్జునుజై గుట్టపైనే చిక్కుకున్న గిరిజనుడిని స్థానికులు జోలే సహాయంతో కిందకు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వ్యక్తిని ముక్కునూరుపాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్యగా గుర్తించారు. వైద్యులు అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు.
…………………………………………..