
– రూ.4.20 లక్షలు కొట్టేశారు..!
– హైదరాబాద్‌లో నయా సైబర్ మోసం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ పే చెల్లింపులపై అతడికి అనుమానాలు ఉన్నాయి.. వాటిని తీర్చుకోవాలని ఆన్ లైన్ లో కస్టమర్ కేర్ నంబర్ కోసం వెదికాడు. ఆ నంబర్ కు ఫోన్ చేయగా.. మీ సందేహాలు మేం తీరుస్తాం అంటూ ఏకంగా 4.20 లక్షల రూపాయలు కొట్టేశారు. అతడికి మోస పోయాక తెలిసింది ఇప్పటి వరకూ తాను మాట్లాడింది సైబర్ నేరగాళ్లతో అని. బల్కంపేటకు చెందిన వ్యక్తి (60) ఫోన్‌పే (PHONE PAY) చెల్లింపులపై సందేహాలు నివృతి చేసుకునేందుకు కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఆన్లైన్లో వెతికాడు. కొంత సేపటి తర్వాత ఫోన్ చేసిన సైబర్ నేరగాడు తాను ఫోన్ పే సపోర్ట్ టీమ్ సభ్యుడిని అని పరిచయం చేసుకున్నాడు. వెరిఫికేషన్‌తోపాటు టెక్నికల్ సమస్యను పరిష్కరించేందుకు ఫోన్ పే యాప్ తెరిచిన తర్వాత స్ర్కీన్ షేరింగ్ చేయాలని సూచించాడు. నేరగాడి మాటలు నమ్మిన బాధితుడు స్ర్కీన్ షేర్ చేసి, బ్యాంకు ఖాతాతోపాటు కార్డు వివరాలు నమోదు చేశాడు. వివరాలు సేకరించిన సైబర్ నేరగాడు కొద్ది సేటి తర్వాత అతడి బ్యాంకు ఖాతా నుంచి పలు దఫాలుగా రూ. 4.20 లక్షలు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరైనా బ్యాంక్ అధికారులు, సిబ్బంది అంటూ లింక్‌లు పంపి వివరాలు నమోదు చేయాలని కోరినా, షేర్ చేయాలని చెబితే సైబర్ మోసమని గ్రహించాలని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నారు.
…………………………………………………