* నిష్పక్షపాతంగా వివరాల నమోదు చేయాలి
* జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: జిల్లాలో పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం ఐడిఓసి సమావేశపు హల్లో ఇందిరమ్మ మొబైల్ యాప్ వినియోగం, సర్వే విధానంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా లబ్ధిదారుల వివరాలు నిష్పక్షపాతంగా నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఎంపీవోలు, కార్యదర్శులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
మొబైల్ యాప్ ను వినియోగిస్తూ క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన తీరును ఒక్కో అంశం వారీగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఏయే అంశాలను పరిశీలించాలి, మొబైల్ యాప్ లో వివరాలను ఏవిధంగా పొందుపర్చాలనే అంశాలను పీపీటీ ద్వారా ప్రయోగాత్మకంగా వివరించారు. సర్వే సందర్భంగా దరఖాస్తుదారుల వివరాలను పక్కాగా సేకరిస్తూ, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యాప్ లో వివరాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరపాలని అన్నారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎలాంటి వివాదాలు, అవకతవకలకు తావులేకుండా సర్వే ప్రక్రియను నిజాయితీగా, నిబద్ధతతో ఈ నెల 20 వరకు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ నారాయణరావు, ఆర్డిఓ మంగిలాల్ మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………