* తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు
* పలు రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి
* టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం, వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో భక్తులు వివిధ ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా ఉచిత బస్సులను పెంచాలని సూచించారు. తిరుమలలో ఘన వ్యర్థా పదార్థాలను వేగంగా తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా టిటిడి ఆలయాలలో ఉత్సవాల సమయాలలో ఆలయాల సుందరీకరణలో భాగంగా గార్డెన్ విభాగం, ఎలక్ట్రికల్ విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృంధాలు శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా కళాప్రదర్శనలు ఇచ్చిన నేపథ్యంలో కళా బృందాలను అభినందిస్తూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తరాలు రాయాలని, సంబంధిత కళాబృందాల పోటోలను పంపాలని సూచించారు. అదేవిధంగా, అప్పలయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులువుగా గుర్తించి వెళ్లేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి ఉద్యోగులు నివాసం ఉండే వినాయక నగర్ క్వార్టర్స్ లలో పెయింటిగ్స్, క్లీనింగ్, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి భూముల మాస్టర్ డేటాబేస్ ను ఏర్పాటు చేయాలని, కల్యాణ మండపాల నిర్వహణపై నివేదిక తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలలో ఆలయాల నిర్మాణాల కోసం భూసేకరణకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తరాలు రాయాలని సూచించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఆలయాల నిర్మాణాలకు సంబంధించి సదరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ఉత్తర ప్రత్యుత్తరాలను వేగవంతం చేయాలన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుండి శ్రీవారి మెట్టుకు భక్తుల వెళ్లేందుకు ప్రైవేట్ వాహనదారులు భక్తుల నుండి అధిక ధరలు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట, అమరావతి, తిరుచానూరు ఆలయాల మాస్టర్ ప్లాన్ లపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఆలయాలలో లైటింగ్, గ్రిల్స్, తదితర అంశాలపై ఆర్కిటెక్ అధికారుల సూచనలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె.వి.మురళీకృష్ణ, ఎఫ్ఎ అండ్ సిఏవో శ్రీ ఓ. బాలాజీ, ఐటీ జీఎం శ్రీ డి. ఫణికుమార్ నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.
………………………………………………………
