
* వేర్వేరు చోట్ల కల్లు తాగినా.. ఒకే లక్షణాలు ఎలా?
* అవి పేరుకే కల్లు కాంపౌండ్లు..
* అక్కడ పొంగేదంతా రసాయనాల నురగే!
* అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే
* కల్తీ కల్లుతో అవయవాలు గుల్లే
* అలాంటి కల్లే ఏడుగురి ప్రాణాలను తీసింది
* పేదల కుటుంబాలను చిన్నాభిన్న చేస్తోంది..
* 45 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు : దామోదర
* అంతకంతకూ పెరుగుతున్న బాధితులు
* బాధితుల లెక్కపై అనుమానాలు
* రూ. 20 లక్షలు పరిహారం చెల్లించాలి : కేటీఆర్
ఆకేరు న్యూస్, ఎక్స్ క్లూజివ్ స్టోరీ
అవి పేరుకే కల్లు కాంపౌండ్లు.. అక్కడ చూపించేది తాజా కల్లు నుంచి పొంగుతున్న నురగ కాదు.. ఆ కల్లు తాగితే ఒక్కో అవయవం వేడినీళ్లకు మరిగిపోయినట్టు.. రసాయనాలకు కరిగిపోవాల్సిందే. కిడ్నీలు ఫట్ అంటాయి. ఎముకలు గుల్లబారుతాయి. సుదీర్ఘకాలంలో ఒంటిని మంచానికే పరిమితం చేయాల్సిందే. తాటి చెట్టు ఎక్కుండానే.. అసలు చెట్లే లేకుండానే.. కల్లును సృష్టిస్తున్నారు. వారు కల్లు తయారుచేసే విధానం తెలిస్తే మన కళ్లు తేలేయాల్సిందే. అలా తయారుచేసిన కల్తీ కల్లే ఏడుగురి పేదలను బలి తీసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య చూస్తుంటే హైదరాబాద్‌లో దొరికేదంతా కల్లీ కల్లేనా అనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వేర్వేరు చోట్ల కల్లు తాగినా.. ఒకే లక్షణాలు ఎలా?
హైదరాబాద్ లో కల్తీకల్లు కాటుకు ఏకంగా ఏడుగురు బలయ్యారు. ఇంకా చాలా మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న వారంతా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. వేర్వేరు కాంపౌండ్ లలో కల్లు తాగినవారు. కానీ అందరికీ ఒకే రకమైన లక్షణాలు. అందరూ ఒకేరకంగా ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనలు, కిడ్నీలు విఫలం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాధితుల సంఖ్య గురించి మంత్రి చెబుతూ నిమ్స్ ఆస్పత్రిలో 31 మంది, గాంధీ ఆస్పత్రిలో 6గురు, వేర్వేరు ఆస్పత్రుల్లో 7గురు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అంటే.. అధికారికంగా 44 మంది. ఇంకా ఆస్పత్రిలో చేరలేక ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్నవారు. ఇంట్లోనే మరణించిన వారూ చాలా మంది ఉంటారని తెలుస్తోంది.
అంతటా కల్తీ కల్లేనా?
కల్తీకల్లు కాటుకు బలైనవారు ఒకేచోట కల్లు తాగలేదు. కూకట్పల్లి, మూసాపేట, ఎల్బీనగర్, దిల్సుఖనగర్.. ఇలా నగర శివారులోని వేర్వేరు ప్రాంతాల్లో కల్లు తాగారు. కానీ అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఒకే లక్షణాలతో ఆస్పత్రులపాలయ్యారు. దీన్నిబట్టి ఎక్కడో ఒక చోట మినహా హైదరాబాద్‌లోని మెజారిటీ కల్లు కాంపౌండ్లలో కల్తీ జరుగుతోందని అర్థం అవుతోంది. ఎలాంటి కల్లును విక్రయించాలన్న దానిపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో 90 శాతం మందులతో తయారు చేసిన కల్లునే విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మందు కల్లుతో అనారోగ్య సమస్యలు రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరంలో ఆ కల్లును తయారుచేసి విక్రయించే దుకాణాలను మూసివేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గీత కార్మికులకు ఉపాధి పేరుతో నగరంలో ఆయా దుకాణాలను ప్రభుత్వం తెరిపించడంతో విక్రయాలు చేపట్టారు.
రసాయనాలు కలిపి.. ప్రాణాలు తీస్తున్నారు..
చెట్ల నుంచి సేకరించిన కల్లు మాత్రమే దుకాణాల్లో విక్రయించాలి. నగరంలో ఈత, తాటి చెట్లు లేవు. జిల్లాల నుంచి రోజూ కల్లు తీసుకొచ్చి విక్రయించే పరిస్థితి అసలే లేదు. అయినా హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. దీని వెనక పెద్ద మాఫియానే ఉంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజూ వారీగా విక్రయించగా మిగిలిన కల్లును డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు. ఆ కల్లు వంద లీటర్లలోకి చేరిన తర్వాత నగరం నుంచి వాహనాల్లో వెళ్లి ఇక్కడకు తీసుకొస్తారు. ఆ తర్వాతే అసలు కల్తీ ప్రారంభమవుతుంది. వారాల తరబడి నిల్వ చేసిన కల్లులో ఆల్ఫ్రాజోలం, సోడియం బై కార్బోనైట్, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ లాంటి ప్రమాదకర నిషేదిత మత్తు పదార్థాలు, రసాయనాల మిశ్రమాలను కలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా 100 లీటర్లు కల్లు సేకరిస్తే, ఇక్కడికి తీసుకొచ్చాక వేర్వేరు మిశ్రమాలతో 1000 లీటర్ల వరకూ పెంచి అమ్మేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. భారీ తొట్టెల్లో నీళ్లు పోసి, బస్తాల కొద్దీ రసాయనాలు, పౌడర్లు పోసి కలిపి తయారు చేసిన కల్లును భారీ ఎత్తున నిల్వ ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఆ కల్లు తాగిన పేదలు సమిధలవుతున్నారు.
అసలెంత మంది..?
కల్తీ కల్లు బారినపడిన బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలిరోజు 16 మంది.. ఆ తర్వాత 28 మంది అంటూ పెరిగిన సంఖ్య.. తాజాగా ఈరోజు మంత్రి దామోదర 44 మంది ఆస్పత్రుల్లో ఉన్నట్టు చెబుతున్నారు. అంతకంతకూ బాధితుల సంఖ్య మారుతుండడంతో బాధితుల లెక్కపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలాఉండగా కల్తీ కల్లుకు కారణమైన ఏడుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కల్లీకల్లు బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
……………………………………………..