
* ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపైనే చర్చ
* ఉత్కంఠగా ఏపీ, తెలంగాణ చర్చలు
* మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో ముఖ్యమంత్రుల భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తొలిసారిగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నీటి వాటాలపై భేటీ అవుతుండడం ఉత్కంఠగా మారింది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కొద్ది కాలంగా ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వివాదాలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్రం జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో ఈ సమావేశం జరపనుంది. సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అయితే.. బనకచర్లపై చర్చకు తెలంగాణ ససేమిరా అంటోంది. నదీజలాల వాటాలపైనే చర్చించాలని పట్టుబడుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో 9 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, ఆ తర్వాతే బనకచర్లపై చర్చ జరపాలని తెలంగాణ వాదిస్తోంది. అయితే.. వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాలను ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని ఏపీ కోరుతోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రుల భేటీ ఉత్కంఠగా మారింది. కేంద్ర జలశాఖ మంత్రితో పాటు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు సమావేశానికి హాజరుకానున్నారు.
…………………………………………