* తెలంగాణలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికీ వర్తింపు
* రేషన్‌కార్డు తప్పనిసరి
* అసలు, వడ్డీ సహా 2 లక్షల వరకు మాఫీ
* 12-12-2018 నుంచి 9-12-2023 మధ్య తీసుకున్న రుణాలకు వర్తింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకూ రుణమాఫీని వర్తింపచేయనుంది. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న 2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. రేషన్‌కార్డుల ప్రాతిపదికన ఆయా కుటుంబాలకు ఈ రుణమాఫీ వర్తించనుంది. తొలి విడతలో మహిళల పేరిట ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేసి, ఆ తర్వాత పురుషుల పేరుతో ఉన్న రుణాలపై దృష్టి సారించనుంది. లబ్ధిదారుల పేర్లను ఆరోహణక్రమంలో గుర్తిస్తూ మాఫీ చేయనుంది. అన్నిషెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు మాఫీ వర్తించనుంది. రుణమాఫీ అమలు కోసం ప్రతి బ్యాంకులో ఓ నోడల్ అధికారికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించనుంది. మాఫీ బాధ్యత పూర్తిగా వ్యవసాయ కమిషనర్‌దేనని మార్గదర్శకాల్లో పేర్కొంది.
————————————————————————–