* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రజా ప్రభుత్వ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30 మహబూబ్నగర్లో నిర్వహించే రైతుల కార్యక్రమాన్ని బహిరంగ సభలా కాకుండా వారికి అవగాహన కల్పించే రైతు సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) అధికారులను ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ, ఈ నెల 30న మహబూబ్నగర్లో నిర్వహించే రైతు సదస్సు వంటి అంశాలపై ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (THUMMALA NAGESHWER RAO) , ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడే విధంగా ఇటీవలి కాలంలో వివిధ కంపెనీల వినూత్న ఉత్పాదనలన్నీ స్టాళ్లలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆధునిక పరికరాల వినియోగం, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్ల వాడకం వంటి సాంకేతిక పరికరాలన్నింటినీ సదస్సు నిర్వహించే చోట ప్రయోగాత్మకంగా ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని.. ఈ సదస్సులో రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల్లో అవగాహన పెంచడానికి వీలుగా సదస్సును ఒకరోజు కాకుండా 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేలా స్టాళ్లను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలన్నారు. తద్వారా రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేలా ఈ సదస్సు ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే రుణమాఫీ అంశం చర్చకు వచ్చినప్పుడు, రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. కొన్నిచోట్ల ఆధార్ నెంబర్ల తప్పులు, బ్యాంకు ఖాతాల్లో నమోదైన పేర్లలో తప్పులు, కుటుంబాల నిర్ధారణ వంటి కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఈ సందర్భంగా సీఎంకు నివేదికను అందించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
