మంత్రి సీతక్క
* రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్
* మంత్రి సీతక్క వెల్లడి
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. జిల్లాలోని జంగాలపల్లి గుట్టను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
శుక్రవారం ములుగు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాలతో కలిసి మంత్రి సీతక్క జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పర్యాటక అభివృద్ధి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గ్రామీణ ఉపాధి, తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
జంగాలపల్లి గుట్టకు పర్యాటక కళ
జంగాలపల్లి గుట్టకు కేప్‌టౌన్‌లోని టేబుల్ మౌంటెన్‌ను పోలిన ఆకృతి ఉందని మంత్రి తెలిపారు. గుట్టపై నుంచి ఒకవైపు లక్నవరం, మరోవైపు రామప్ప ప్రాంతాలు కనిపించే అద్భుతమైన వ్యూ పాయింట్ ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ఇందుకోసం ఆర్కిటెక్ట్‌లు, పర్యాటక రంగ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జిల్లాలో వెలుగులోకి వస్తున్న గుహలు, గుట్టలు, కోటలు, పురాతన ఆలయాలను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు.
రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ప్రాంతంలో రూ.13 కోట్లతో ఐలాండ్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సీతక్క తెలిపారు. పర్యాటకులను ఆకట్టుకునేలా కొత్త డిజైన్‌తో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం కలగకుండా కొత్త నిర్మాణాలు చేపడతామని వివరించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక యాప్
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామాల్లో ఉన్న వసతులు, అవసరమైన పనులు, మంజూరైన నిధులు, పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. తాను, సంబంధిత కార్యదర్శులు, కమిషనర్లు నేరుగా వివరాలను పరిశీలించి అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.
ఉపాధి హామీతో 375 రకాల పనులు
ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు శాశ్వత ఆస్తుల కల్పనకు ఉపాధి హామీ పథకంలో 375 రకాల పనులు చేపట్టవచ్చని మంత్రి వివరించారు. వీవో భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, గ్రంథాలయాలు, పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, వివాహ కార్యక్రమాల కోసం రూ.15 లక్షలతో భవనాల నిర్మాణం వంటి పనులకు అవకాశం ఉందన్నారు.
చెరువుల్లో పూడికతీత, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు రహదారులు వంటి పనులు చేపట్టవచ్చన్నారు. బీటీ రహదారుల నిర్మాణానికి కూడా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పనుల అమలులో సమన్వయం కోసం ఎంపీడీవో చైర్మన్‌గా మండల స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు
కరువు సమయంలో ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డులు అందించి పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి పనులను గుర్తించి వాటి సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిస్తున్నారని తెలిపారు. తొమ్మిది నెలల పాటు ప్రజలకు ఉపాధి కల్పించేలా విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రహదారుల నిర్మాణం, విద్యుత్ లైన్ల మార్పు, పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, టూరిజం నోడల్ అధికారి ధర్మ నాయక్, డీఆర్డీఓ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ, ములుగు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

