ములుగు డీఎస్పీ రవీందర్, తాడ్వాయి ఎస్సై జగదీష్
* పోక్సో చట్టంపై అవగాహన
ఆకేరు న్యూస్, ములుగు: బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, పోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా శుక్రవారం తాడ్వాయి మండల పరిధిలోని నర్సాపూర్ (పిఎల్) గ్రామాన్ని ములుగు డీఎస్పీ రవీందర్, తాడ్వాయి ఎస్సై జగదీష్ సందర్శించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు బాలికలు మైనర్లని, వారి సంరక్షణ, భద్రత, భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బాలికల చదువు, ఆరోగ్యం, వ్యక్తిగత భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పిల్లల సమస్యలను తెలుసుకుంటూ వారితో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. బాలికకు 18 సంవత్సరాలు, బాలుడికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. గ్రామంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
అలాగే పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమలు చేస్తోందని వివరించారు. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలేనని, మైనర్లతో జరిగే లైంగిక చర్యలు వారి సమ్మతి ఉన్నప్పటికీ నేరంగా పరిగణించబడతాయని తెలిపారు. పిల్లలపై లైంగిక నేరాలు జరిగినప్పుడు వాటిని దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నేరం జరిగినట్లు తెలిసి కూడా సమాచారం ఇవ్వకుండా ఉండటం చట్టప్రకారం శిక్షార్హమని వివరించారు.
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంలో పిల్లలకు తగిన జాగ్రత్తలు తెలియజేయాలని, ఆన్లైన్ వేధింపుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తాడ్వాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది, నర్సాపూర్ గ్రామస్తులు, యువతీ యువకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

