* ఉత్తుత్తి ఇంటర్వ్యూలు.. నకిలీ కాల్ లెటర్లు
* ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ అంటూ మోసాలు
* ఐటీ కొలువుల క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న నేరగాళ్లు
* ఐటీ కారిడార్‌లో బోర్డు తిప్పేస్తున్న ఐటీ సంస్థలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన శ్రీనివాస్ నిరుద్యోగి. ఉద్యోగం కోసం నగరానికి చేరుకున్నాడు. ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఒకరి సలహాతో మాదాపూర్‌లోని ఓ సంస్థను సంప్రదించాడు. శిక్షణ అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఉద్యోగం వస్తుందన్న ఆశతో యువకుడి తల్లిదండ్రులు అప్పు చేసి మరీ రూ.3 లక్షలు చెల్లించారు. కొంత కాలం శిక్షణ పేరుతో ఏమార్చిన మోసగాడు, ఓ రోజు కార్యాలయానికి తాళం వేసి పత్తా లేకుండా పోయాడు. ఇలా శ్రీనివాస్ ఒక్కడే కాదు.. జిల్లాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన యువతలో చాలా మంది మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ పేరుతో ఒకరు, బ్యాక్ డోర్లో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మరొకరు నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు.
రూ.లక్షలు వసూలు చేస్తూ..
ఐటీ కంపెనీ పెట్టి బ్యాక్ డోర్ పేరుతో వందల మందిని చేర్చుకుని వసూళ్ల లక్ష్యం పూర్తి కాగానే కంపెనీని ఎత్తేస్తున్నారు. పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలను రిజిస్టర్ చేసుకున్న మోసగాళ్లు, ఐటీ కారిడార్‌లో చిన్నపాటి కార్యాలయాల్లో ప్రారంభిస్తున్నారు. నిరుద్యోగులను ఆకర్షించేందుకు కమీషన్ ఇచ్చి కన్సల్టెంట్లను నియమించుకుంటున్నారు. ఉద్యోగం కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో సంస్థలో 300 నుంచి 600 మందిని చేర్చుకుంటున్నారు. ఐడీ కార్డు లాప్టాప్ ఇచ్చి ఆన్లైన్ ట్రైనింగ్ పేరుతో కాలయాపన చేస్తూ, కోట్లు వసూలు చేసి ప్రాజెక్ట్‌లు రాలేదన్న సాకుతో సంస్థను మూసేస్తున్నారు.
ముఠాలుగా ఏర్పడి మోసాలు
ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలంటూ వందలాది మందిని మోసం చేసిన నలుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఈనెల 10న అరెస్ట్ చేశారు. విచారణలో ఏడుగురు కలిసి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ముఠా వందలాది మందిని మోసం చేసి కోట్లు కాజేసింది. వీరు జీతాలు ఇవ్వకపోగా, ఇదేమని ప్రశ్నించిన వారిని ఉద్యోగం నుంచి తొలగించామని భయభ్రాంతులకు గురిచేసింది.
బ్యాక్‌డోర్‌లో ఉద్యోగాలంటూ..
మాదాపూర్ కావూరిహిల్స్లోని వీవీ చాంబర్స్ నాలుగో అంతస్తులో ‘సినర్జీ యూనివర్సల్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. బ్యాక్‌డోర్‌లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను నమ్మించిన యాజమాన్యం ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసింది. డబ్బులు కట్టిన వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చి, వర్క్‌ఫ్రం హోం అంటూ ఇంటికి పంపారు. సినర్జీ యూనివర్సల్ యాజమాన్యం ఆరునెలల్లో దాదాపు 500 మందిని బ్యాక్ డోర్ ఉద్యోగాల పేరుతో చేర్చుకొని, ప్రాజెక్ట్‌లు రాలేదని చెబుతూ బోర్డు తిప్పేశారు. ఈ సంస్థ నిర్వాహకులు రూ.15 కోట్ల మేర మోసం చేశారు.
ఆన్లైన్ ఇంటర్వూ నిర్వహించి..
బెంగళూరు దొడ్డబల్లాపుర ప్రాంతానికి చెందిన ఎస్ మహేష్ ఎనిమిది మంది నుంచి రూ.46.19 లక్షలు వసూలు చేశాడు. ఆన్లైన్ ఇంటర్వూ నిర్వహించి, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చాడు. ఆఫర్ లెటర్లు తీసుకొని ఆయా సంస్థల వద్దకు వెళ్లిన వారు తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా మహేష్‌పై 16 కేసులు నమోదయ్యాయని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు.
……………………………………………………….
