* తుదిఘట్టానికి చేరుకున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం
* మాటల తూటాలను వదులుతున్న నాయకులు
* పతాకస్థాయికి చేరిన పరస్పర ఆరోపణలు
* వ్యక్తి గత ఆరోపణలతో వేడెక్కిన రాజకీయం
* ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో నేతలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నవంబర్ 11న ఎన్నికలు ఉన్న నేపధ్యంలో రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ లో ప్రచారం ముగియనుంది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి జూబ్లీహిల్స్ లో రణరంగ వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్‌లో ఎన్నిక అనివార్యమైంది, నిజానికి ఆయన మరణించిన రోజు నుంచే జూబ్లీహిల్స్ లో ఎన్నికల వాతావరణం మొదలైంది. 2023 లో జరిగిన
ఎన్నికల్లో జూబ్లీహిల్ష్ సీటును బీఆర్ ఎస్ గెలుచుకుంది. గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ సీటును బీఆర్ ఎస్ గెలుస్తోంది. నిజానికి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. కాగా హైదరాబాద్ పరిధిలో ఇది రెండో ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికను మూడు పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి.
ఎలాగైనా సీట్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో బీఆర్ ఎస్ ఉంటే ,ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకుంటోంది కాంగ్రెస్. ఇక బీజేపీ విషయానికొస్తే తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీకి తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. కిషన్ రెడ్డి పార్లమెంటరీ పరిదిలో జూబ్లీహిల్స్ ఉండడంతో ఈ ఎన్నిక బీజేపీకి అగ్ని పరీక్ష లాంటిదే..
బీఆర్ ఎస్ ప్రచార సరళి..
ఇతర పార్టీల కంటే ముందే మైదానంలోకి దిగిన బీఆర్ ఎస్ నేతలు నియోజకవర్గంలో గల్లీ గల్లీ ప్రచారం నిర్వహించారు. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో అగ్రనేత హరీష్ రావు లు స్టార్ కంపైనర్లుగా ప్రచారం చేయగా బీఆర్ ఎస్ ముఖ్యనేతలందరూ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు కౌంటర్‌గా బాకీ కార్డులు అంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని ప్రజలకు వివరించే ప్రయత్నరం చేశారు. కారు కు బుల్డోజర్ కు మధ్య పోటీగా ఈ ఎన్నికలను అభివర్ణించారు. కాంగ్రెస్ గెలిస్తే పేదల ఇళ్లను కూలగొడుతుందని పేదలకు ఇళ్లు లేకుండా చేస్తుందని
హైడ్రా పేరుతో అరాచకాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను రౌడీ షీటర్ గా పేర్కొన్నారు. రౌడీ షీటర్‌కు ఎలా ఓటేస్తారని ప్రజలను ప్రశ్నించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దాడులకు దిగారు.సీఎం రేవంత్ రెడ్డి ని మాఫియా లీడర్ తో పోల్చారు.
కాంగ్రెస్ గెలిస్తే మహిళల మెడలో పుస్తెల తాడును లాక్కంటారనే తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజలు పదేళ్ల కేసీఆర్ పాలననే గుర్తు చేసుకుంటారనే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ కు ఎంత ముఖ్యమో బీఆర్ ఎస్ కు అంతకంటే ఎక్కువ ముఖ్యం, ఈ ఎన్నికల్లో గెలిస్తేనే
స్థానిక సంస్థల్లో మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోయే అవకాశం ఉంది. రానున్నది బీఆర్ ఎస్ ప్రభుత్వమేనని ప్రజలు బీఆర్ ఎస్ ను కోరుకుంటున్నారని రెండెళ్లలో కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి వచ్చిందంటూ ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలే బీఆర్ ఎస్ పార్టీకి సూచికలను చెప్పవచ్చు.
ఎందుకంటే మళ్లీ అధికారంలోకి రావాలని తహ తహ లాడుతున్న బీఆర్ ఎస్ కు ఈ ఎన్నికల్లో గెలవడం ముఖ్యం..
దూకుడు పెంచిన కాంగ్రెస్..
సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం మొదలు పెట్టిన తరువాత కాంగ్రెస్ ప్రచారంలో ఊపందుకుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రచారంలో పాల్గోన్నారు. మొత్తంగా మైనార్టీ ఓట్లను ఆకర్శించే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలోనే మహ్మద్ అజహరుద్దీన్ ను మంత్రిగా తీసుకున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టి అప్పుల పాలైందని వివరించే ప్రయత్నం చేశారు. పదేళ్లలో మునిసిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ జూబ్లీహిల్స్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. కేటీఆర్‌ను చీడ పురుగుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్‌కు డ్రగ్స్ కల్చర్‌ను తీసుకొచ్చిందే కేటీఆర్ అని రేవంత్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఓ రెఫరండంలాంటిదనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టని ఓడించడం అంత తేలికకాదు అనే సందాశాన్ని ఇవ్వాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. ఈ ఎన్నికల్లో నెగ్గి మరింత రెట్టించిన ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
తీరు మారని బీజేపీ..
బీజేపీ ఎప్పటిలాగే ఈ ఎన్నికలను బీజేపీ, మజ్లిస్ ల మధ్య పోరుగు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, ధర్మపురి శ్రీనివాస్ తదితరులు శక్తి వంచన లేకుండా హిందూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ఎప్పటి నుంచో తెలంగాణలో అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మక మైనదే..
2023 ఓటింగ్ సరళి..
2023లో బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చౌదరి విజయం సాధించారు. 80,549 ఓట్లు పడగా కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజహరొద్ధీన్ 64,212 ఓట్లు వచ్చాయి. 16,337 ఓట్ల తేడాతో బీఆర్ ఎస్ అభ్యర్థీ గెలిచారు. మూడో స్థానికి బీజేపీ పరిమితమైంది. లంకల దీపక్ రెడ్డికి 25,886 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌ను కైవసం చేసకుంటుందా.. లేక బీఆర్ ఎస్ సీటు కాపాడుకుంటుందా.. బీజేపీ కోరిక నెరవేరుతుందా అనేది ఈనెల 14న తేలనుంది.
